SA vs IND: ఆరంభం అదిరింది.. భారత్ చేతిలో సఫారీలు చిత్తు

దక్షిణాఫ్రికాతో (SA vs IND) మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆదివారం జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 17 Dec 2023 19:49 IST

జొహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో (SA vs IND) మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆదివారం జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (5/37), అవేశ్‌ ఖాన్‌ (4/27) విజృంభించడంతో సఫారీలు 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు చేతులెత్తేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్‌ గైక్వాడ్ (5) తొందరగానే పెవిలియన్ చేరినా.. అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ (55*; 43 బంతుల్లో 9 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లకు భారత పేసర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా అర్ష్‌దీప్, అవేశ్‌ ఖాన్‌ వరుసగా వికెట్లు పడగొట్టి అతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఆ జట్టులో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ ఫెలుక్వాయో (33) టాప్‌ స్కోరర్. అతడితోపాటు ఓపెనర్ టోనీ డిజోర్జి (28), సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్‌ మార్‌క్రమ్‌ (12), షంసి (11*) మాత్రమే రెండంకెల స్కోరు చేయడం గమనార్హం. మిగతా సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), కేశవ్‌ మహరాజ్‌ (4) పరుగులు చేశారు. రీజా హెండ్రిక్స్, వాండర్‌ డసెన్, వియాన్‌ ముల్డర్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఒక దశలో 52 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 80లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ఫెలుక్వాయో దూకుడుగా ఆడి ఆడటంతో దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. సౌతాఫ్రికా కోల్పోయిన మొదటి తొమ్మిది వికెట్లు పేసర్లు పడగొట్టినవే. చివరి వికెట్‌గా నంద్రి బర్గర్‌ను కుల్‌దీప్‌ ఔట్ చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని