IPL 2023 Final: ‘నేను గుజరాత్‌ బిడ్డను.. అయినా నా మనసు చెన్నై గెలవాలనుకుంటోంది’

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), గుజరాత్ టైటాన్స్‌ (GT) మధ్య ఆదివారం జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌ (IPL 2023 Final)లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

Updated : 27 May 2023 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  ఐపీఎల్-16 సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారమే ఫైనల్. ఈ టైటిల్‌ పోరు (IPL Final 2023)లో డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌ (GT), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) తలపడనున్నాయి. రెండూ బలమైన జట్లే కావడంతో ఫైనల్‌ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నైని ఓడించి గుజరాత్ వరుసగా రెండో ఏడాది టైటిల్‌ ఎగరేసుకుపోతుందా? లేక  ధోనీ (MS Dhoni) తన వ్యూహాలతో సీఎస్కేకు ఐదో కప్‌ను అందిస్తాడా? అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్ (Irfan Pathan) ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనే దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గుజరాత్, చెన్నై జట్లలో ఏ జట్టుని ఎంపిక చేసుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురయ్యానని పేర్కొన్నాడు. కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తనకు ఎమోషనల్ అని పఠాన్ చెప్పాడు. ఆటగాడిగా ధోనీకిదే ఆఖరి ఐపీఎల్‌ అని వార్తలు వస్తున్నందున ఈ సీజన్‌లో చెన్నై విజేతగా నిలవాలని కోరుకుంటున్నట్లు ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.

‘‘నాణ్యతాపరంగా, బౌలింగ్ విభాగంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కంటే గుజరాత్ టైటాన్స్ చాలా ముందుంది.  ఒక్కో ఆటగాడిపరంగా చూసుకున్న గుజరాత్‌దే పైచేయి. కానీ..  సీఎస్కే, గుజరాత్ మధ్య ఇది ​ఎమోషనల్ మ్యాచ్ అవుతుంది. నేను గుజరాతి బిడ్డగా గుజరాత్‌ గెలవాలనుకుంటున్నా. కానీ, నా మనసు మాత్రం ధోనీ వైపు మొగ్గు చూపుతోంది. అతను వచ్చే ఏడాది ఆడతాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ధోనీ ఫ్యాక్టర్ కారణంగా నా హృదయం సీఎస్కేకు మద్దతు ఇస్తోంది’ అని ఇర్ఫాన్‌ పఠాన్ వివరించాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం (మే 28) సాయంత్రం 7.30 గంటలకు ఫైనల్ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. అయితే,  సాయంత్రం 4 గంటల నుంచే ముగింపు వేడుకులను అట్టహాసంగా నిర్వహించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని