deepti sharma: దీప్తి శర్మ హెచ్చరించిందో లేదో నాకు తెలియదు: ఝులన్‌ గోస్వామి

దీప్తి శర్మ మన్కడింగ్‌పై మాజీ టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి స్పందించింది. 

Updated : 07 Dec 2022 18:58 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌తో చివరి వన్డే సందర్భంగా భారత మహిళా జట్టు బౌలర్‌ దీప్తి శర్మ చేసిన రనౌట్‌ (మన్కడింగ్‌) వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంపై టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి స్పందించింది. 

‘‘రనౌట్‌కు ముందు డీన్‌ను దీప్తి హెచ్చరించిందో లేదో నాకు తెలియదు. ఆ సమయంలో నేను చాలా దూరంగా ఉన్నాను. అంపైర్‌, కెప్టెన్‌ మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో నాకు ఏమాత్రం తెలియదు. కానీ దీప్తి చేసిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించడం లేదు. మేం నిబంధనల మేరకే ఆడాం. ఈ రనౌట్‌ న్యాయమైందేనని ఎంసీసీ సైతం స్పష్టతనిచ్చింది.  అయినప్పటికీ నిబంధనల అతిక్రమణ జరిగిందని మీరు భావిస్తే ఇక మేం చేసేదేమీ లేదు. జరిగిన దాంట్లో మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’’ అని ఝులన్‌ చెప్పింది.

రనౌట్‌ వ్యవహారంపై దీప్తి శర్మ ఇటీవల స్పందిస్తూ.. పదే పదే హెచ్చరించినప్పటికీ డీన్‌ క్రీజు దాటి ముందుకు కదలడం వల్లనే అలా చేయాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని అంపైర్‌ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు తెలిపింది. అయితే ఇంగ్లాండ్‌ సారథి హీథర్‌ నైట్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది. తమ చర్యను సమర్థించుకునేందుకే టీమ్‌ ఇండియా అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని