KL Rahul: లఖ్‌నవూ వేదిక.. ఇప్పటికీ ఆ బాధ అలానే ఉంది: కేఎల్ రాహుల్

వరుసగా ఐదు విజయాలు సాధించి ఊపు మీదున్న టీమ్‌ఇండియా (IND vs ENG) మరో కీలక పోరులో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. లఖ్‌నవూ స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Updated : 29 Oct 2023 12:29 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో ఇంగ్లాండ్‌తో లఖ్‌నవూ వేదికగా భారత్ (IND vs ENG) తలపడనుంది. లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంతో టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023)లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు సారథిగా రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలానే ఈ స్టేడియంలో చేదు అనుభవమూ రాహుల్ ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌ లీగ్‌ మధ్యలోనే గాయపడటంతో దాదాపు ఐదు నెలలు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఫ్రెష్‌గా ఆడాలని ఈ మిడిలార్డర్‌ బ్యాటర్ భావిస్తున్నాడు.

‘‘ఇప్పటికీ ఆ బాధ అలానే ఉంది. ఇదే మైదానంలో ఆడుతూ గాయపడ్డా. దీంతో ఐదు నెలలపాటు క్రికెట్‌కు దూరం కావాల్సి వచ్చింది. అదే నాకు చాలా కఠినమైన సమయం. ఎవరైనా సరే గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత పునరాగమనం చేయాలంటే చాలా కష్టం. మీరు ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు. దాని కోసం తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉంది. ఓర్పుతో ఉండాలి. అదంత సులువేం కాదు. క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. ఒక్కోసారి వంద చేయొచ్చు. మరోసారి చేయలేకపోవచ్చు. సక్సెస్‌ లేదా వైఫల్యాలను నేర్పుగా హ్యాండిల్‌ చేయాలి. గాయాలపాలైన తర్వాత అది మరింత కష్టంగా మారుతుంది. ఫిజియో చేయించుకున్నా సరే నొప్పి మాత్రం వస్తూనే ఉంటుంది. దానిని అధిగమించాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా మారాలి. 

ఈసారి వరల్డ్‌ కప్‌లో అద్భుత విజయాలతో కొనసాగుతున్నాం. లఖ్‌నవూ స్టేడియానికి వచ్చినప్పుడు మరోసారి గత జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. ఆడుతూ జారిపడటంతో గాయపడ్డాను. నేను దానిని మరిచిపోదామని భావిస్తున్నా. కానీ, అభిమానులు గుర్తు చేస్తున్నారు. అయితే, నేను దానిని పక్కనపెట్టేసి తాజాగా బరిలోకి దిగుతున్నా. భారీ ఇన్నింగ్స్‌ లేదా ఇతర అద్భుత ఫలితంతో వాటన్నింటినీ మరిచిపోతా’’ అని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని