Kuldeep Yadav: వసీమ్‌ అక్రమ్ కావాలనుకున్నా.. షేన్‌వార్న్‌లా మారిపోయా: కుల్‌దీప్‌

అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) వరల్డ్‌ కప్‌లో రాణిస్తున్నాడు. ఎడమచేతివాటం లెగ్‌ స్పిన్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తోన్న కుల్‌దీప్ తొలుత పేసర్‌గా మారాల్సింది. కానీ, అతడి కోచ్‌ సలహా మేరకు స్పిన్నర్‌ అవతారం ఎత్తాడు.

Published : 24 Oct 2023 14:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అనుకోకుండా వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World Cup 2023) టోర్నీ ఆడుతున్నవారిలో కుల్‌దీప్‌ యాదవ్ ఒకడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరీ భారత జట్టులోకి వచ్చాడు. ప్రధాన స్పిన్‌ బౌలర్‌గా మారిపోయాడు. ఐదు మ్యాచుల్లో 8 వికెట్లు తీసి అదరగొట్టేస్తున్నాడు. చైనామన్‌ తరహా బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న కుల్‌దీప్‌ తొలుత పేసర్‌ అవుదామని భావించాడట. చివరికి స్పిన్నర్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇలా మారడానికిగల కారణాలను కూడా వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్‌ చేసింది. 

‘‘నేను పాక్‌ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ బౌలింగ్‌ను ఇష్టపడతా. నాకు ఐడల్ కూడా అతడు. నేను కూడా అక్రమ్‌లా పేసర్‌ అవ్వాలనుకున్నా. అయితే, నా కోచ్ సలహాతో స్పిన్నర్‌గా మారిపోయా. ‘ఎవరూ మణికట్టు లెఫ్ట్‌ఆర్మ్‌ బౌలర్లు లేరు. నువ్వు అలా ప్రయత్నించు. విజయవంతమవుతావు’ అని కోచ్‌ చెప్పడంతో ప్రయత్నించా. స్పిన్‌ కేటగిరీలో నాకు రోల్‌ మోడల్‌ షేన్ వార్న్. అతడిని అనుకరించేవాడిని కూడా. ఎప్పుడైనా బౌలింగ్‌కు సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే వార్న్‌ పాత వీడియోలను చూసేవాడిని. అతడితో కొంతసమయం మాట్లాడటం కూడా అదృష్టమే. టీవీల్లో వార్న్ బౌలింగ్‌ చూస్తూ పెరిగినవాడిని. బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టిస్తాడు? అతడి ప్రణాళికలు ఏంటనేది ఆసక్తికరంగా ఉంటాయి. మానసికంగానూ దృఢమైన వ్యక్తి. 2019లో నేను సిడ్నీ టెస్టు ఆడుతున్న సమయంలో బౌలింగ్‌కు సంబంధించిన సూచనలు చేశాడు. ఎప్పటికీ వార్న్‌ సూచనలను, సలహాలను మరిచిపోలేను’’ అని కుల్‌దీప్‌ వ్యాఖ్యానించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని