NED vs SL: శ్రీలంకకు గట్టి సవాల్.. అద్భుతంగా పోరాడిన సిబ్రాండ్‌, వాన్‌బీక్‌

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్.. సిబ్రాండ్‌ (70), వాన్‌బీక్‌ (59) అద్భుతంగా పోరాడటంతో మంచి స్కోరు సాధించింది. 

Published : 21 Oct 2023 14:34 IST

లఖ్‌నవూ: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో నెదర్లాండ్స్‌ను 91/6కు కట్టడి చేసిన శ్రీలంక బౌలర్లు తర్వాత పట్టు విడిచి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన నెదర్లాండ్స్‌.. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (70; 82 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), వాన్‌ బీక్ (59; 75 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) అద్భుతంగా పోరాడటంతో మంచి స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో వీరిద్దరు తప్ప మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. వాన్‌బీక్‌, సిబ్రాండ్ జోడీ ఏడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్‌ మధుశంక 4, కాసున్ రజిత 4, మహీశ్ తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టపాటపా వికెట్లు

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే నెదర్లాండ్స్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ విక్రమ్‌జిత్ (4)ను కాసున్ రజిత ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. మరో ఓపెనర్ మాక్స్‌ ఔడౌడ్ (16), కోలిన్ అకెర్మాన్ (29) నిలకడగా ఆడటంతో నెదర్లాండ్ కాస్త గాడినపడ్డట్లే కనిపించింది. ఈ క్రమంలో ఔడౌడ్, అకెర్మాన్‌ వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. వీరిద్దరిని కూడా రజితనే ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన బాస్‌ డి లీడే (6), తేజ నిడమనూరు (9)ని దిల్షాన్‌ మధుశంక వెనక్కిపంపాడు. బాస్‌ డీ లీడే కుశాల్ పెరీరాకు క్యాచ్‌ ఇవ్వగా.. తేజ నిడమనూరు వికెట్ల ముందు దొరికిపోయాడు. కాసేపు నిలకడగా ఆడిన స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (16)ని మహీశ్ తీక్షణ బౌల్డ్ చేశాడు. దీంతో నెదర్లాండ్స్‌ 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని