Matthew Hayden: భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌.. మనమే నెగ్గుదాం: మ్యాథ్యూ హేడెన్

టీ20 ప్రపంచకప్‌ పోరు ముగిసింది. ఇంగ్లాండ్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకొంది. అయితే తమ ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారని పాక్‌ మెంటార్‌ మ్యాథ్యూ హేడెన్ తెలిపాడు.

Published : 15 Nov 2022 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2022 టైటిల్‌ను ఇంగ్లాండ్‌ సొంతం చేసుకొంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి మరీ కప్‌ను రెండోసారి తన ఖాతాలో వేసుకొంది. ఈ క్రమంలో పాక్‌ మెంటార్‌ మ్యాథ్యూ హేడెన్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మా ఆటగాళ్లు వెనుకడుగు వేయలేదు. ప్రతి గేమ్‌ కోసం నెట్స్‌లో చెమటోడ్చారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా ఏదైనా సరే ఇక్కడి వరకు వచ్చినందుకు అభినందనలు. మీ ప్రదర్శనతో ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేశారు. మీతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకొన్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని హేడెన్‌ తెలిపాడు. 

భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 నాటికి పాక్‌ ప్రదర్శన మరింత పెరుగుతుందని హేడెన్‌ పేర్కొన్నాడు. ‘‘గత నెల ఆసీస్‌లో మా ఇంట్లో విందు సమయంలో పాక్‌ తప్పకుండా టీ20 ప్రపంచకప్‌ను సాధిస్తుందని గట్టిగా భావించా. ఇందులో ఎలాంటి మార్పు లేదు.  తప్పకుండా పాకిస్థాన్‌ జట్టు వన్డే ప్రపంచకప్‌ను సగర్వంగా ఎత్తుకొనే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బయటపడిన బలహీనతలను అధిగమించి భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌ నాటికి సిద్ధంగా ఉంటాం. అప్పుడు మరిన్ని సంబరాలు చేసుకొంటాం’’ అని హేడెన్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని