Mohammad Kaif: అశ్విన్‌ను ఎంపిక చేయకుండా.. ఆ ముగ్గుర్ని ఎందుకు తీసుకున్నారు?

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేయకుండా ముగ్గురు లెగ్‌ స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని టీమ్ఇండియా...

Updated : 11 Jun 2022 10:51 IST

(Photo: Mohammad Kaif Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేయకుండా ముగ్గురు లెగ్‌ స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అశ్విన్‌ ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ తరఫున మంచి ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన కైఫ్‌.. టీమ్‌ఇండియా జట్టు ఎంపికపై స్పందించాడు. రెండు జట్లూ సరైన ఆటగాళ్లతో ఉన్నా టీమ్‌ఇండియాలో సమతూకం లోపించిందని చెప్పాడు.

‘ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు మంచి ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నాయి. కానీ, భారత జట్టు యుజ్వేంద్ర చాహల్‌, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌ వంటి ముగ్గురు లెగ్‌ స్పిన్నర్లను ఎంచుకుంది. ఈ ముగ్గుర్నీ ఎక్కడ ఆడిస్తారు? ఇక్కడ అశ్విన్‌ లాంటి మేటి స్పిన్నర్‌ లేకపోవడం నన్ను నిరాశకు గురిచేసింది. అతడు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఆ ముగ్గురు లెగ్‌ స్పిన్నర్లలో ఒకరిని తప్పించి అశ్విన్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది. తన బౌలింగ్‌తో వేరియేషన్లు చూపించేవాడు. అలాగే కెప్టెన్‌కు కూడా అతడిని ఉపయోగించుకునేందుకు వీలుండేది. మరోవైపు బ్యాటింగ్‌లోనూ పరుగులు సాధిస్తున్నాడు. అలాంటప్పుడు అశ్విన్‌ను కాకుండా ముగ్గురు లెగ్‌ స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారో అర్థంకావడం లేదు’ అని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, వచ్చేనెల ఇంగ్లాండ్‌ పర్యటన ఉండటంతో ఈ సిరీస్‌లో పలువురు సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అశ్విన్‌ కూడా దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని