Icc World Cup: 2027లో సరికొత్తగా

2023 ప్రపంచకప్‌ ముగిసింది. ఇక 2027 ప్రపంచకప్‌పైకి దృష్టి మళ్లనుంది.

Published : 20 Nov 2023 03:57 IST

2023 ప్రపంచకప్‌ (Icc World Cup) ముగిసింది. ఇక 2027 ప్రపంచకప్‌పైకి దృష్టి మళ్లనుంది. అయితే నాలుగేళ్ల తర్వాత జరిగే ఆ టోర్నీ సరికొత్త అనుభూతి పంచబోతోంది. పోటీపడే జట్లు, ఫార్మాట్‌, నిబంధనలు.. ఇలా కొత్త మార్పులతో అభిమానులను అలరించనుంది. ఈ సారి పది జట్లు కప్పు కోసం పోటీపడ్డాయి. మొత్తం 48 మ్యాచ్‌లు జరిగాయి. కానీ 2027లో జట్ల సంఖ్య 14కు పెరుగుతుంది. మ్యాచ్‌ల సంఖ్య మరింత పెరిగి 54కు చేరుతుంది. దక్షిణాఫ్రికా (South Africa), జింబాబ్వే (zimbabwe), నమీబియా (namibia) కలిసి ఆతిథ్యమివ్వబోతున్న ఆ మెగా టోర్నీ ఎన్నో విశేషాలకు వేదిక కానుంది.

ఫార్మాట్‌ ఇలా..: 2003 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా నిర్వహించాయి. 2027లో ఈ రెండు దేశాలతో పాటు నమీబియా కూడా టోర్నీకి ఆతిథ్యమిస్తుంది. అయితే 2003 మాదిరే 2027లో ఫార్మాట్‌ ఉండనుంది. ఈసారి 10 జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో తలపడ్డాయి. ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడింది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరాయి. కానీ వచ్చే ప్రపంచకప్‌లో 14 జట్లను ఏడేసి చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి.  అనంతరం తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్‌ చేరతాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.  ఇప్పటికే ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా ఈ ప్రపంచకప్‌ ఆడతాయి. అర్హత టోర్నీ నుంచి మిగతా నాలుగు జట్లు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని