Published : 22 May 2021 01:31 IST

IPL: కొట్టింది 129.. అడ్డుకుంది 128 

మూడో కప్పును అందించింది ఒక్క పరుగే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ ఎంత విజయవంతమైన జట్టో అందరికీ తెలిసిందే. ఈ టోర్నీలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఇప్పటివరకూ ఐదుసార్లు టైటిల్‌ సాధించింది‌. రోహిత్ కెప్టెన్సీకి, ఆటగాళ్ల అంకితభావానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఒత్తిడిలోనూ ప్రత్యర్థిని చిత్తు చేయగల ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. అందువల్లే ఐపీఎల్‌ ఫైనల్స్‌లో రెండుసార్లు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ముంబయి మూడో సారి కప్పు సాధించి నేటికి నాలుగేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆ మ్యాచ్‌ విశేషాలు ఒకసారి నెమరువేసుకుందాం.

కళ తప్పిన బ్యాటింగ్‌..

2017 మే 21న ముంబయి ఇండియన్స్‌, రైజింగ్‌ పుణె జట్టుతో తలపడి ఒకే ఒక్క పరుగుతో విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పుణె బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్‌ మొత్తం చేతులెత్తేశారు. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రోహిత్‌(24; 22 బంతుల్లో 4x4), కృనాల్‌ పాండ్య(47; 38 బంతుల్లో 3x4, 2x6) కాస్త పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. క్రిస్టియన్‌, జంపా, ఉనద్కత్‌ తలా రెండు వికెట్లు తీసి రోహిత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కళ తప్పేలా చేశారు. దాంతో ఆ జట్టు 129/8 స్కోరుకే పరిమితమైంది.


వెన్ను విరిచిన బౌలింగ్‌..

ఇక ముంబయి నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుణె ఆధిపత్యం చలాయించినా చివరికి చతికిలపడింది. 16.2 ఓవర్లకు 98/3తో పటిష్ట స్థితిలో నిలిచి తర్వాత ఓటమిపాలైంది. ఓపెనర్‌ అజింక్య రహానె(44; 38 బంతుల్లో 5x4), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌(51; 50 బంతుల్లో 2x4, 2x6) నిలకడగా ఆడి మ్యాచ్‌ను గెలిపించేలా కనిపించారు. అయితే, ముంబయి బౌలర్లు చివరి క్షణాల్లో కట్టుదిట్టంగా బంతులేసి పుణె విజయాన్ని అడ్డుకున్నారు. ఆఖర్లో ధోనీ(10), మనోజ్‌ తివారి(7) క్రిస్టియన్‌(4) విఫలమయ్యారు. ఇక జాన్సన్‌ వేసిన చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన వేళ మనోజ్‌ తొలి బంతిని బౌండరీ బాదాడు. దాంతో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ, తర్వాతి రెండు బంతుల్లో అతడితో పాటు స్మిత్‌ కూడా ఔటయ్యాడు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైన వేళ క్రిస్టియన్‌, వాషింగ్టన్‌ రెండు పరుగులే తీసి 128/6కే పరిమితమయ్యారు.

కాగా, ముంబయి 2019లోనూ ఇలాగే చెన్నైతో తలపడిన ఫైనల్స్‌లో ఒక్క పరుగుతోనే విజయం సాధించింది. తొలుత రోహిత్‌ టీమ్‌ 149/8 స్కోర్‌ చేయగా ఆపై ధోనీసేన 148/7కే పరిమితమైంది. ఈ రెండు మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగడం గమనార్హం.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts