PBKS vs MI: ఐపీఎల్‌ చరిత్రలో ముంబయి పేరిట అరుదైన రికార్డు..!

రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) తన జోరును ప్రదర్శిస్తోంది. పాయింట్ల పట్టికలోకి ఒక్కో అడుగు ముందుకేస్తూ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంటూ సాగుతోంది. తాజాగా పంజాబ్‌ను మట్టికరిపించిన ముంబయి అరుదైన ఘనతను సాధించింది.

Updated : 04 May 2023 12:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో (IPL 2023) ముంబయి ఇండియన్స్‌ (MI) హవా మొదలైంది. వరుసగా రెండు ఓటములతో టోర్నీని ప్రారంభించిన ముంబయి జట్టు ఫామ్‌లోకి వచ్చేసింది. హ్యాట్రిక్‌ విజయాలతోపాటు కఠినమైన రాజస్థాన్‌ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌ జట్లను మట్టి కరిపించి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ క్రమంలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ 200కిపైగా టార్గెట్‌ను ఛేదించిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబయి (10) ఏకంగా ఆరో స్థానానికి చేరుకుంది. మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయం. 

పంజాబ్‌పై ప్రతీకారం.. 

ముంబయి వేదికగా ఏప్రిల్ 22న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 215 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మొహాలీ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం 215 టార్గెట్‌ను ముంబయి నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలోనే అవలీలగా ఛేదించింది. దీంతో అప్పటి ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లు అయిందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ముంబయి ఇండియన్స్‌ ట్విటర్‌ ఖాతాలోనూ అప్పటి, ఇప్పటి మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను జత చేసింది. అయితే, ఏప్రిల్ 22కి బదులు ఏప్రిల్‌ 23 అని మెన్షన్‌ చేసిన ముంబయి.. ‘మేం కాస్త ఉత్సాహంగా ఉన్నాం’ అనే క్యాప్షన్‌ను జోడించింది. సూర్యకుమార్‌ ఈ రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.

ఓటమి నుంచి గెలుపు..

పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబయి ఇండియన్స్‌ 213 పరుగులను ఛేదించి విజయం సాధించింది. ఐపీఎల్‌లో వాంఖడే వేదికగా ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అయితే, చివరి నాలుగు ఓవర్లకు 57  పరుగులు చేయాల్సిన తరుణంలో టిమ్‌ డేవిడ్ కేవలం 14 బంతుల్లోనే ఏకంగా 45 పరుగులు జోడించి ముంబయిని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లోనూ సూర్యకుమార్‌ (55) అర్ధశతకం బాదాడు. తొలుత రాజస్థాన్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124) భారీ శతకం సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని