NZ vs SA: దంచికొట్టిన క్వింటన్ డికాక్‌, వాండర్‌ డసెన్.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.

Published : 01 Nov 2023 18:02 IST

పుణె: సెమీఫైనల్‌ రేసు ఆసక్తికరంగా మారిన వేళ పుణెలో సమవుజ్జీల పోరు జరుగుతోంది. జోరుమీదున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్‌తో తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.  ఓపెనర్ క్వింటన్ డికాక్ (114; 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి చెలరేగాడు. ఈ ప్రపంచకప్‌లో అతడికిది నాలుగో సెంచరీ. వాండర్‌ డసెన్ (133; 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకం బాదాడు. ఓపెనర్ తెంబా బావుమా (24) పరుగులు చేయగా.. చివర్లో డేవిడ్‌ మిల్లర్ (53; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి అర్ధ శతకం సాధించాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ట్రెంట్ బౌల్ట్, నీషమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇన్నింగ్స్‌ ఆరంభంలో డికాక్ నెమ్మదిగా ఆడగా.. బావుమా బౌండరీలు బాదాడు. తొమ్మిదో ఓవర్‌లో బావుమాను ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన డసెన్‌తో జోడీకట్టిన డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో డికాక్‌ 103 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన డికాక్‌, డసెన్ జోడీని సౌథీ విడదీశాడు. అతడి బౌలింగ్‌లో డికాక్.. ఫిలిప్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటికే నీషమ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది డసెన్ మూడంకెల స్కోరు (101 బంతుల్లో) అందుకున్నాడు.  అనంతరం సౌథీ బౌలింగ్‌లో డసెన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న మిల్లర్ దూకుడుగా ఆడాడు. నీషమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో సిక్స్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు.. తర్వాతి బంతికే డారిల్ మిచెల్‌కు చిక్కాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని