IND vs AFG: అఫ్గాన్‌తో మ్యాచ్‌.. అశ్విన్‌కు బదులు శార్దూల్ అయితే బెటర్: మాజీ క్రికెటర్

పేరుకే పసికూన.. మైదానంలోకి దిగితే పెద్ద జట్లకూ చెమటలు పట్టించగల టీమ్ అఫ్గానిస్థాన్‌. అలాంటి జట్టుతో దిల్లీ మైదానం వేదికగా భారత్‌ (IND vs AFG) ఇవాళ తలపడనుంది.

Published : 11 Oct 2023 10:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమ్‌ఇండియా (IND vs AFG) తలపడనుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ మైదానంలో అదనంగా మరొక బ్యాటర్‌తో బరిలోకి దిగితే బాగుంటుందని మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ సూచించాడు. అందుకోసం ఒక స్పిన్నర్‌ను తగ్గించుకుని పేస్‌ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని పేర్కొన్నాడు. దిల్లీ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని.. స్పిన్నర్ల ప్రభావం చాలా తక్కువని తెలిపాడు. దక్షిణాఫ్రికా - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ ఇందుకు ఉదాహరణగా వెల్లడించాడు. అయితే, అఫ్గాన్‌ జట్టులో స్పిన్నర్లే కీలకమని.. వారితో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదని వ్యాఖ్యానించాడు.

‘‘హార్దిక్‌ పాండ్య పూర్తి స్థాయి పేసర్‌గా అనిపించడం లేదు. అతడిని మూడో ఫాస్ట్‌ బౌలర్‌గా పరిగణించలేం. అతడు ఒత్తిడిగా భావిస్తున్నాడు. ఇది ఆసీస్‌తో మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ఇక దిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. మరీ ముఖ్యంగా స్పిన్నర్లకు సహకారం చాలా తక్కువ. కాబట్టి, అఫ్గాన్‌తో మ్యాచ్‌కు రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కడం కష్టమే. భారత్ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పెంచుకోవాలి. అదే విధంగా పేస్‌ బౌలింగ్‌ను కూడా పటిష్ఠం చేసుకోవాలి. అందుకోసం అశ్విన్‌కు బదులు శార్దూల్ ఠాకూర్‌ లేదా మహమ్మద్ షమీని తీసుకోవడం ఉత్తమం’’ అని సంజయ్‌ మంజ్రేకర్ తెలిపాడు. 

దిల్లీ మైదానంలో దక్షిణాఫ్రికా- శ్రీలంక మ్యాచ్‌లో భారీగా పరుగులు నమోదయ్యాయి. తొలుత సౌతాఫ్రికా 428/5 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో 326 పరుగులు చేసింది. దీంతో ఒకే మ్యాచ్‌లో 750కిపైగా పరుగులు నమోదు కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా జట్టులో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్‌ -3 బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన ట్రాక్‌పై ఈ సారి చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. అఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేస్తే బోల్తా పడక తప్పదు. బలమైన జట్లకు షాకిచ్చే సత్తా ఆ జట్టు సొంతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని