Rahul Dravid : ప్రసిద్ధ్‌ కృష్ణను ఎందుకు తీసుకున్నామంటే.. వివరించిన రాహుల్‌ ద్రవిడ్‌

గాయం కారణంగా ప్రపంచకప్‌ టోర్నీకి హార్దిక్‌ పాండ్య దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. ఇందుకు గల కారణాలను హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) వివరించాడు.

Updated : 05 Nov 2023 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఈ ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో అజేయంగా దూసుకుపోతున్న టీమ్‌ ఇండియా(Team India).. తనలాగే ఉత్తమ ప్రదర్శన చేస్తున్న దక్షిణాఫ్రికాతో నేడు తలపడనుంది. దీంతో ఈ పోరు(IND vs SA) రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. గాయం కారణంగా టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) ఈ ప్రపంచకప్‌ టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో జట్టులోకి ప్రసిద్ధ్‌ కృష్ట(Prasidh Krishna)ను తీసుకున్నారు. దీనిపై హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) వివరణ ఇచ్చాడు. అతడి ఎంపికకు గల కారణాలను వివరించాడు. టీమ్‌ఇండియా పేస్‌ బౌలింగ్‌ వనరులను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

‘ఇది మంచి ఆలోచన. మేం ముగ్గురు ఫాస్టబౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్లో ఆడాం. 15 మందితో కూడిన జట్టులో మాకు స్పిన్‌ బ్యాకప్‌(అశ్విన్‌) ఉంది. అలాగే ఆల్‌రౌండర్‌(శార్దూల్‌ ఠాకూర్‌) బ్యాకప్‌ ఉంది. అయితే.. ఫాస్ట్‌ బౌలింగ్‌ బ్యాకప్‌ లేదు. ఎవరైనా అనారోగ్యం బారిన పడ్డా, గాయపడ్డా.. అందుకోసం బ్యాకప్‌ అవసరమని గుర్తించాం. ఇది ఇతర కాంబినేషన్లతో ఆడేందుకు మాకు ఉపయోగపడుతుంది’ అని ద్రవిడ్‌ వివరించాడు.

అక్టోబర్‌ 19న పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తుండగా గాయపడిన హార్దిక్‌.. ఆ తర్వాత మళ్లీ బరిలో దిగలేదు. సెమీఫైనల్‌ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని అనుకున్నా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో టోర్నీ మొత్తానికి దూరం కాక తప్పలేదు. ఇక ప్రసిద్ధ్‌ కృష్ణ ఇప్పటి వరకూ 17 వన్డేలు ఆడి 29 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఆడాడు.

ఇక ప్రస్తుతం టీమ్‌ఇండియాలో పేస్‌ త్రయం బుమ్రా, షమి, సిరాజ్‌ అదరగొడుతుండడంతో.. వీరిలో ఎవరికైనా గాయమైతే తప్ప ప్రసిద్ధ్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని