IND vs PAK: సచిన్‌ వికెట్‌ కోసం రెండు ఫ్రేమ్‌లు కట్‌ చేశారు: పాక్‌ మాజీ స్పిన్నర్

టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన వన్డే ప్రపంచకప్‌ 2011 (ODI World Cup) మెగా టోర్నీలో సచిన్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పాక్‌పై మరింత చెలరేగే సచిన్‌ (Sachin) ఎల్బీ విషయంలో దాయాది దేశం మాజీ స్పిన్పర్‌ ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.

Published : 02 Jul 2023 13:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ -  పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఫ్యాన్స్‌ ఎంత ఉత్సాహంగా ఉంటారో.. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా అంతే ఒత్తిడికి గురవుతుంటారు. వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) టోర్నీల్లో పాక్‌పై భారత్‌దే ఆధిక్యం. ధోనీ సారథ్యంలో 2011 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా (Team India) నెగ్గిన విషయం తెలిసిందే. సెమీస్‌లో పాక్‌ను ఓడించి మరీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే, ఆ మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ ఎల్బీపై నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. పాక్‌ మాజీ  స్పిన్నర్ సయీద్‌ అజ్మల్ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇప్పటికీ ఆ నిర్ణయం సరైంది కాదనే వాదిస్తున్నాడు.

‘‘భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2011 మెగా టోర్నీలో ఆడాను. సచిన్‌ తెందూల్కర్‌ వికెట్‌పై వివాదాస్పదమైన నిర్ణయం గుర్తుండే ఉంటుంది. నేను ఇప్పటికీ దానిని ఔట్‌గానే భావిస్తా. గతంలో అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. థర్డ్‌ అంపైర్‌ సమీక్ష సందర్భంగా చివరి రెండు ఫ్రేమ్‌లను కట్‌ చేసి బంతి స్టంప్స్‌ను తాకకుండా పక్కకు వెళ్లినట్లు చూపించారు. నేను సంధించిన ఆ బంతి నేరుగా మిడిల్‌ స్టంప్‌నే తాకేది’’ అని అజ్మల్‌ వ్యాఖ్యానించాడు. 

వన్డే ప్రపంచకప్‌ 2011 సెమీస్‌లో భారత్ తొలుత 260/9 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో సచిన్‌ 85 పరుగులు చేశాడు. ఛేదనలో పాక్ 231 పరుగులకే ఆలౌటైంది. అయితే, సచిన్‌ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు సయీద్ అజ్మల్ వేసిన బంతిని ఆడబోయి మిస్‌ కావడంతో ప్యాడ్లను తాకింది. బౌలర్ అప్పీలు చేయడంతో అంపైర్ ఇయాన్‌ గౌల్డ్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఔట్‌పై సమీక్ష తీసుకొనేందుకు నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న గౌతమ్‌ గంభీర్‌తో సచిన్‌ తెందూల్కర్‌ చర్చించాడు. గంభీర్‌ కూడా కాస్త అనుమానంగా ఉన్నప్పటికీ.. సచిన్‌ మాత్రం నమ్మకంతో డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. సమీక్షలో బంతి వికెట్లను తాకడం లేదని తేలడంతో సచిన్‌ నాటౌట్‌గా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని