pat cummins: కొత్త బంతితో బౌలింగ్‌ చేయడానికి కారణమదే: పాట్ కమిన్స్

ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌ను తన సొంత మైదానంలో 2 పరుగుల తేడాతో ఓడించింది.

Updated : 10 Apr 2024 12:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ (Pat Cummins) కొత్త బంతితో కాకుండా.. మిడిల్‌ ఓవర్లలో బౌలింగ్‌కు వస్తుంటాడు. పవర్‌ ప్లే చివరి ఓవర్‌ లేదా ఆ తర్వాత నుంచి రంగంలోకి దిగే అతడు.. పంజాబ్‌తో మ్యాచ్‌లో మాత్రం భువనేశ్వర్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్నాడు. రెండో ఓవర్‌ను కమిన్స్‌ వేశాడు. అతడు సంధించిన నాలుగో బంతికే డేంజరస్‌ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత  కాసేపటికే ప్రభ్‌ సిమ్రన్‌తోపాటు శిఖర్ ధావన్‌ను భువీ ఔట్ చేసి మ్యాచ్‌పై హైదరాబాద్‌ పట్టు బిగించారు. కొత్త బంతితో బౌలింగ్‌ చేయడానికిగల కారణాలను కమిన్స్‌ మ్యాచ్‌ అనంతరం వెల్లడించాడు. 

‘‘పంజాబ్ బౌలర్లు ఆరంభంలో మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. నితీశ్‌ రెడ్డి వల్లే మేం 180 పరుగులు చేయగలిగాం. లక్ష్య ఛేదనలోనూ పంజాబ్‌ చాలా దగ్గరగా వచ్చింది. మొదట్లోనే కీలక వికెట్లు తీసి వారిని కట్టడి చేయడంతో మ్యాచ్‌లో గెలిచేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. కొత్త బంతితో బౌలింగ్‌ చేయడం ఎప్పుడూ కష్టమే. బ్యాటర్లు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. అయితే, కొత్త బంతే కీలకమని మేం భావించాం. నేను కూడా ఆరంభంలోనే ఓవర్లు వేయడానికి కారణం కూడా అదే. పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని నేను, భువీ భావించాం. త్వరగా వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చనే ప్రణాళికతోనే బరిలోకి దిగి.. విజయవంతమయ్యాం. కుడి, ఎడమ చేతివాటం బ్యాటర్లు, బౌలర్లతో జట్టు సమతూకంగా ఉంది. నితీశ్‌ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. గత వారమే అరంగేట్రం చేసినా ఎక్కడా ఆ ఒత్తిడి కనిపించనీయలేదు. బౌలింగ్‌లోనూ రాణించాడు. ఫీల్డింగ్‌లో సత్తా చాటాడు’’ అని కమిన్స్‌ తెలిపాడు. హైదరాబాద్‌ కెప్టెన్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

వారిద్దరు గెలిపిస్తారనుకున్నా: శిఖర్ ధావన్

‘‘హైదరాబాద్‌ను భారీ స్కోరు చేయనీయకుండా కట్టడి చేయగలిగాం. కానీ, లక్ష్య ఛేదనలో మాకు తొలి ఆరు ఓవర్లలో సరైన ఆరంభం దక్కలేదు. మూడు వికెట్లను కోల్పోయి ఇబ్బంది పడ్డాం. అక్కడే మేం వెనుకబడిపోయాం. పిచ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు. ఇక చివరి బంతికి క్యాచ్‌ను చేజార్చి సిక్స్‌ సమర్పించాం. మరో 15 పరుగులు ఇచ్చి ఉండాల్సింది. మా బౌలర్ల శ్రమను తక్కువ చేయడం లేదు. మా టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. యువ క్రికెటర్లు శశాంక్‌, అషుతోష్‌ మాత్రం మా ఆశలను నిలిపారు. చివరి బంతి వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఇదే ఆత్మవిశ్వాసంతో మున్ముందు మ్యాచుల్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం’’ అని పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ (Shikhar Dhawan) వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు