CSK vs PBKS: ఆ రెండు ఓవర్లే.. మ్యాచ్‌ను మాకు దూరం చేశాయి: ఎంఎస్ ధోనీ

ఐపీఎల్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై పంజాబ్‌ కింగ్స్‌ (CSK vs PBKS) విజయం సాధించింది. ఈ ఓటమిపై ధోనీ స్పందించాడు.

Updated : 01 May 2023 07:42 IST

ఇంటర్నెట్ డెస్క్: చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను (CSK) ఓడించడం సాధారణ విషయం కాదు. అలాంటి ఫీట్‌ను మొన్న రాజస్థాన్‌ తర్వాత తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి బంతికి పంజాబ్‌ లక్ష్య ఛేదన పూర్తి చేసి సంచలనం సృష్టించింది. సీఎస్‌కే నిర్దేశించిన 201 పరుగుల టార్గెట్‌ను సరిగ్గా 20 ఓవర్లలోనే ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. పతిరాణా వేసిన బంతిని సికందర్ రజా బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ దిశగా పంపించి మూడు రన్స్‌ తీసేశాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉండేది. ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యేవి. ఇప్పుడు పంజాబ్ విజయం సాధించడంతో సీఎస్‌కే నాలుగో స్థానానికే పరిమితమైంది. పంజాబ్‌ కింగ్స్‌ ఆరో స్థానం నుంచి ఐదుకు ఎగబాకింది.

మరికొన్ని చేసి ఉంటే..: సీఎస్‌కే సారథి

తమ ఓటమికి బ్యాటింగ్‌లో ఇంకొన్ని పరుగులు చేయకపోవడమే కారణమని సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. ‘‘మేం బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మరికొన్ని పరుగులను అదనంగా చేయాల్సింది. కనీసం మరో 15 పరుగులు చేసి ఉంటే బాగుండేది. మా బ్యాటర్లు స్థిరంగా పరుగులు రాబట్టారు. ఈ పిచ్‌ మీద 200 పరుగులు మంచి లక్ష్యమే అవుతుంది. అయితే, మా బౌలింగ్‌ కూడా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. రెండు ఓవర్లు మా ఫలితాన్ని మార్చేశాయి. సమస్య ఎక్కడుందో సమీక్షించుకోవాలి. మా ప్రణాళికలో ఏదైనా పొరపాటు ఉందా? ప్లాన్‌ను అమలు చేయడంలో లోపాలు ఉన్నాయా? అనేది తెలుసుకుంటాం. పతిరాణా చాలా అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు’’ అని ధోనీ అన్నాడు. దేశ్‌పాండే వేసిన 16వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు... ఆ తర్వాతి ఓవర్‌లోనే జడేజా 17 పరుగులు సమర్పించాడు. ధోనీ ఈ రెండు ఓవర్ల గురించే వ్యాఖ్యానించాడు. ఇక 19వ ఓవర్‌లోనూ పాండే మరో 13 పరుగులు ఇచ్చాడు. దీంతో పంజాబ్‌ బ్యాటర్లు కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులను రాబట్టారు. 

ఇది ఎంతో ప్రత్యేకం: ధావన్‌

‘ఈ విజయం ఎంతో ప్రత్యేకమైంది. చెపాక్‌లో చెన్నైను ఓడించడం అతిపెద్ద విషయం. మా ఆటగాళ్లు అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు. గత మ్యాచ్‌లో ఘోర ఓటమి తర్వాత పుంజుకుని గెలవడం ఎంతో బాగుంది. మా బౌలర్లు కూడా తమవంతు కృషి చేశారు. ఛేదనలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ టచ్‌లోకి రావడం ఆనందంగా ఉంది. అందరూ ఉత్తమంగా ఆడటం శుభసూచికం’’ అని పంజాబ్‌ కెప్టెన్ ధావన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని