Punjab X Mumbai: అశుతోష్‌ అదరగొట్టినా.. ముంబయిదే విజయం

పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్‌ అయింది.    

Updated : 19 Apr 2024 00:21 IST

ముల్లన్‌పుర్‌: ఐపీఎల్‌ 2024లో ముంబయి థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్‌ అయింది. అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడి పంజాబ్‌ను గెలిపించినంత పనిచేశాడు. శశాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. జస్‌ప్రీత్ బుమ్రా (3/21), గెరాల్డ్ కొయెట్జీ (3/32) పంజాబ్‌ను దెబ్బకొట్టారు. ఆకాశ్ మధ్వాల్, హార్దిక్‌ పాండ్య, శ్రేయస్ గోపాల్‌ తలో వికెట్ పడగొట్టారు. 

లక్ష్యఛేదనలో బుమ్రా, కొయెట్జీ దెబ్బకు పంజాబ్‌ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సామ్ కరన్ (6), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0), రిలీ రొసోవ్ (1), లివింగ్‌స్టన్ (1) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. హర్‌ప్రీత్ సింగ్ భాటియా (13) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ దూకుడుగా ఆడి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపారు. అయితే 111 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా శశాంక్‌ వెనుదిరిగినప్పటికీ అశుతోష్‌ పట్టువదలకుండా పోరాడాడు. దీంతో పంజాబ్‌ లక్ష్యం 18 బంతుల్లో 25 పరుగులుగా మారింది. ఈ తరుణంలో 17.1 ఓవర్ల వద్ద కొయెట్జీ బౌలింగ్‌లో అశుతోష్‌ ఔట్‌ అయ్యాడు. ఈ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక 19వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్య.. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (21)ను ఔట్‌ చేశాడు. ఐదో బంతికి రబాడ సిక్స్‌ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్‌ విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులుగా మారింది. ఈ సమయంలో ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. 20 ఓవర్‌ను మధ్వాల్‌ వేశాడు. తొలి బంతి వైడ్‌ పడింది. రెండో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో రబాడ రనౌట్‌ అయ్యాడు. అంతే ఇక ముంబయి శిబిరంలో ఆనందం వెల్లువెత్తింది.   

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (78: 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దుమ్మురేపాడు. రోహిత్‌శర్మ (36: 25 బంతుల్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు), తిలక్‌ వర్మ (34: 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, సామ్‌ కరన్‌ 2, రబాడ ఒక వికెట్‌ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని