Cheteshwar Pujara : జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.. కోహ్లీ సెంచరీపై పుజారా కీలక వ్యాఖ్యలు

విరాట్‌ కోహ్లీ(Virat Kohli) సెంచరీ సాధించిన తీరుపై వెటరన్‌ క్రికెటర్‌ పుజారా(Cheteshwar Pujara) అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు.

Updated : 21 Oct 2023 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో టీమ్‌ఇండియా(Team India) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 4 విజయాలతో సెమీస్‌ రేసులో మరో అడుగు ముందుకేసింది. ఇక బంగ్లాదేశ్‌పై పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) శతకంతో అలరించాడు. అయితే.. విరాట్‌ శతకం సాధించిన తీరుపై వెటరన్‌ క్రికెటర్‌ పుజారా(Cheteshwar Pujara) అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెంచరీకి చేరుకునే క్రమంలో కోహ్లీ కాస్తా నెమ్మదిగా ఆడటం.. అతడికి స్ట్రైక్‌ ఇచ్చేందుకు కేఎల్‌ రాహుల్‌ సింగిల్‌ తీసేందుకు కూడా నిరాకరించిన విషయంపై పుజారా స్పందించాడు. జట్టు కోసం ఆడేందుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరాడు.

‘విరాట్‌ కోహ్లీ ఆ సెంచరీ సాధించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. అయితే.. ఆటను వీలైనంత త్వరగా ముగించాలన్న విషయాన్నీ మీరు గుర్తించుకోవాలి. మీ నెట్‌ రన్‌రేట్‌ అగ్రస్థానంలో ఉండాలి. మీరు ఉత్తమ నెట్‌ రన్‌రేట్‌ కోసం పోరాడుతున్నప్పుడు.. వెనక్కి తిరిగి చూసుకోవద్దు’ అని పుజారా సూచించాడు.

ఈ ముగ్గురు మొనగాళ్లను కివీస్‌ అడ్డుకుంటుందా?

కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లు జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇక వ్యక్తిగత మైలురాళ్ల విషయానికొస్తే ఆటగాళ్ల మనస్తత్వం కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ‘సమష్టి నిర్ణయం ద్వారా మీరు కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆటగాళ్లకు మైలురాళ్లు అవసరమే.. అయితే జట్టు ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించకూడదు. ఓ ఆటగాడిగా మీకు ఎప్పుడూ ఛాయిస్‌ ఉండాలి. కానీ కొందరు ఆటగాళ్లు సెంచరీ చేస్తే.. అది తర్వాతి గేమ్‌లో సహాయపడుతుందని భావిస్తారు. అయితే.. అది మీ మనస్తత్వంపైనే ఆధారపడి ఉంటుంది’ అని పుజారా వివరించాడు.

బంగ్లాతో మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ ఊహించనిదే. జట్టు స్కోరు 231 ఉన్నప్పుడు అతడి స్కోరు 74. ఆ తర్వాత అతడు మిగతా అన్ని పరుగులు చేసి సగర్వంగా మూడంకెల స్కోరు అందుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో సెంచరీ అవకాశం ఉన్నా కోహ్లీ వద్దనుకున్నాడనీ.. కానీ తాను పట్టుబట్టడంతో చివరికి శతకాన్ని చేరుకున్నాడని కేఎల్‌ రాహుల్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని