Bumrah: బుమ్రా వెన్ను నొప్పి.. ఎన్‌సీఏ అప్‌డేట్‌ కోసం వేచి ఉన్నాం: రాహుల్‌ ద్రవిడ్‌

వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా గాయంపై టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ తాజాగా స్పందించాడు.

Published : 01 Oct 2022 18:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న ఏకైక వార్త.. జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడా..? లేదా..? వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి కూడా కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే బుమ్రా గాయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇప్పటికే స్పందించాడు. ‘బుమ్రా ఇంకా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించలేదు. దీనిపై ఉత్కంఠ ఉంది. అతడు జట్టుకు దూరమైనట్లు ఇప్పుడే చెప్పకండి’’ అని తెలిపాడు. తాజాగా టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ కూడా ప్రస్తావించాడు.

ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌ జరగబోయే సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో బుమ్రా గాయంపై ద్రవిడ్‌ స్పందించాడు. ‘‘ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ప్రకారం.. బుమ్రా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో లేడు. జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. అక్కడ వైద్య బృందం పరిశీలించి పరిస్థితి ఏంటనేది వెల్లడిస్తుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందనే తెలియాలంటే వేచి చూడాలి. గత మెడికల్ రిపోర్టులను లోతుగా పరిశీలించలేదు. నిపుణులు చెప్పేదానిపైనే నేను ఆధారపడతాను. ప్రస్తుతం బుమ్రాను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు మాత్రమే తప్పించారు. అధికారికంగా ఇప్పటికీ అతడు టీ20 ప్రపంచ కప్‌ నుంచి వైదొలిగినట్లు కాదు. మనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం’’ అంటూ ద్రవిడ్‌ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో మిగతా రెండు టీ20లకు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని