Rahul Dravid: 2022లోనేద్రవిడ్‌కు అసలైన పరీక్ష..!

 భారత్‌లో కిక్రెట్‌ను ఒక మతంలా ఆరాధిస్తే.. క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు.. నిత్యం వారు ఏమి చేసినా సంచలనంగానే ఉంటుంది. కానీ...

Updated : 11 Jan 2022 15:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: భారత్‌లో కిక్రెట్‌ను ఒక మతంలా ఆరాధిస్తే.. క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు.. నిత్యం వారు ఏమి చేసినా సంచలనంగానే ఉంటుంది. కానీ, ఈ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటాడు టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణ, అంకితభావంతో శ్రద్ధగా నిర్వహించడమే అతడి ప్రత్యేకత. మైదానంలో ఉన్నప్పుడు మెరుపులూ లేవు.. ప్రత్యర్థులు కవ్విస్తే ఉరుములూ ఉండవు. కానీ, నిశ్శబ్దంగా తన పని తాను పూర్తి చేస్తూ జట్టుకు ‘గోడ’లా నిలబడటమే ఆ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ నైజం. అది ఆటగాడిగానైనా.. ఇప్పుడు టీమ్‌ఇండియా కోచ్‌గానైనా. భారత క్రికెట్‌కు తన శక్తియుక్తులు ధారపోస్తున్న ద్రవిడ్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ‘ది వాల్‌’పై ప్రత్యేక కథనం.

నిరూపించుకొనే వచ్చాడు..

ఈ టీమ్ఇండియా మాజీ సారథి ఇప్పటికే వివిధ జట్లకు కోచ్‌గా పనిచేసి సత్తాచాటాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతడు తర్వాత కోచ్‌గా మారాడు. ఈ క్రమంలోనే 2014 నుంచి రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు తొలి సేవలు అందించాడు. ఆపై 2016లో అండర్‌-19, భారత్‌- ఎ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. దీంతో ఇప్పుడు టీమ్‌ఇండియాలో సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లంతా అతడి కనుసన్నల్లోనే వెలుగులోకి వచ్చారు. అందులో పృథ్వీషా, శుభ్‌మన్‌గిల్‌, రిషభ్‌ పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ద్రవిడ్‌ శిక్షణలోనే 2016 అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రన్నరప్‌గా నిలిచింది. ఇక 2018లో ఏకంగా కప్పు అందుకొని సంచలనం సృష్టించింది. ఆ సమయంలోనే సీనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలని బీసీసీఐ కోరినా.. సున్నితంగా తిరస్కరించాడు. అనంతరం 2019 నుంచి జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా పని చేసిన వాల్‌.. చివరికి గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ బాధ్యతలు స్వీకరించాడు.

దక్షిణాఫ్రికా అసలైన పరీక్ష..


 

ద్రవిడ్‌ గతేడాది చివర్లో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్‌తో రవిశాస్త్రి పదవీకాలం పూర్తవడంతో తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లకు ద్రవిడ్‌ తొలిసారి జాతీయ జట్టు బాధ్యతలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్‌ అటు పొట్టి సిరీస్‌ను, ఇటు టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని రాణించింది. దీంతో కోచ్‌గా ద్రవిడ్‌ తొలి అడుగు బలంగానే వేశాడు. ఇక ఇప్పుడు టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. ఇక్కడే అసలు పరీక్ష ఎదురుకానుంది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ చరిత్ర తిరగరాస్తూ అక్కడ తొలిసారి టెస్టు విజయం రుచిచూసింది. ఇక జోహానెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుదలగా ఆడి విజయం సాధించడంతో సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా మారింది. దీంతో మూడో టెస్టు రసవత్తరంగా మారింది. అయితే, టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే తొలిసారి సఫారీల గడ్డపై టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇది జరగాలంటే కోహ్లీసేన విశేషంగా రాణించాలి. అది నిజమైతే కోచ్‌గా ద్రవిడ్‌ తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లే.

ముందుంది మెగా ఈవెంట్‌..


 

టీమ్‌ఇండియా ఈ దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేస్తే ద్రవిడ్‌ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే భారత్‌ 2018-19 ఆస్ట్రేలియా పర్యటన వరకూ దాని సొంత గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచింది లేదు. కానీ, మాజీ కోచ్‌ రవిశాస్త్రి పర్యవేక్షణలో అక్కడ వరుసగా రెండు సిరీస్‌లు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. దీంతో శాస్త్రి కెరీర్‌లో ఈ రెండు సిరీస్‌లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాగే దక్షిణాఫ్రికా గడ్డపైనా భారత్‌ ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ సాధించింది లేదు. దీంతో టెస్టు హోదా కలిగిన జట్లలో ఈ ఒక్క దేశంలోనే భారత్‌ సిరీస్‌ గెలవలేదు. ఈ మూడో టెస్టులో గెలుపొందితే.. శాస్త్రి లాగే ద్రవిడ్‌కు సైతం ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సిరీస్‌గా మిగిలిపోతుంది. మరోవైపు గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో వాయిదా పడిన చివరి టెస్టును సైతం భారత్‌ ఈ ఏడాది సొంతం చేసుకుంటే ద్రవిడ్‌ కెరీర్‌లో మరో కలికితురాయి చేరినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్‌ ఆ సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఐదో టెస్టును కూడా గెలుపొందితే 3-1 తేడాతో సిరీస్‌ సొంతం చేసుకుంటుంది. దీంతో ద్రవిడ్‌ ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచిన భారత కెప్టెన్‌గా, కోచ్‌గా కొత్త ఘనత సాధిస్తాడు. వీటికి తోడు భారత్‌ ఈ ఏడాది ఐసీసీ 2022 టీ20 ప్రపంచకప్‌ కూడా ఆడుతుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఆ మెగా ఈవెంట్‌ను కూడా సాధిస్తే ద్రవిడ్‌కు తిరుగుండదు. దీంతో ఈ ఏడాది అతడికి సవాళ్లతో కూడుకున్నదిగా మారింది. ఏదేమైనా ఇప్పటికే యవకులను మ్యాచ్‌ విన్నర్లుగా తీర్చిదిద్దిన ‘ది వాల్‌’ రాబోయే రోజుల్లో టీమ్‌ఇండియాను మరింత బలోపేతం చేస్తాడని ఆశిద్దాం. హ్యాపీ బర్త్‌డే రాహుల్‌ ద్రవిడ్‌..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని