SA vs IND: రింకు సిక్స్‌ కొడితే బాక్స్‌ బద్దలైంది.. వైరల్‌ అవుతున్న వీడియో

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ (Rinku Singh) (68) అర్ధ శతకంతో అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఆడిన ఓ భారీ షాట్‌కు మీడియా బాక్స్‌ అద్దం పగిలింది. 

Published : 13 Dec 2023 16:42 IST

ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా (Team India) డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రింకు సింగ్‌ (Rinku Singh) (68; 39 బంతుల్లో 9 ఫోర్లు,, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరవడంతో మొదట భారత్‌ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వర్షం వల్ల టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 19.3 ఓవర్ల వద్దే ముగిసింది. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో సవరించిన లక్ష్యాన్ని (15 ఓవర్లలో 152) దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్‌లో మొదట్లో నెమ్మదిగా ఆడిన రింకు తర్వాత జోరందుకున్నాడు. 30 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్న రింకు తర్వాత మరింత రెచ్చిపోయాడు. మార్‌క్రమ్ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్స్‌లతో అలరించాడు. అయిదో బంతిని ముందుకొచ్చి వైడ్‌ లాంగ్‌లో స్టాండ్స్‌లో కొట్టిన రింకు.. తర్వాత బంతిని బౌలర్‌ తలమీదుగా బాదడంతో మీడియా బాక్స్‌ అద్దం పగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తాను ఆడిన షాట్‌తో అద్దం పగిలినందుకు మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ నిర్వహించిన చిన్న ఇంటర్వ్యూలో రింకు సింగ్ క్షమాపణలు చెప్పాడు. ‘‘నేను ఆడిన షాట్‌కు మీడియా బాక్స్‌ రూమ్‌  అద్దం పగిలిందని నాకు తెలియదు. డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది. అలా జరిగినందుకు క్షమించండి’’ అని రింకు సింగ్ పేర్కొన్నాడు. అతడు కొంచెం కూడా గర్వం లేకుండా హుందాగా సారీ చెప్పడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సూర్యభాయ్‌తో మాట్లాడా 

సూర్యకుమార్‌, రింకు సింగ్ క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత్ భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌తో మాట్లాడిన విషయాలను రింకు పంచుకున్నాడు. ‘‘నేను బ్యాటింగ్‌కి వెళ్లేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.  సూర్యభాయ్‌ నాకు పలు సూచనలు ఇచ్చాడు. ఒత్తిడికి లోనుకాకుండా నీ సహజ శైలిలో ఆడమని చెప్పాడు. క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయ తీసుకున్నా. నిజానికి ఆరంభంలో పిచ్‌ కాస్త కఠినంగా అనిపించింది. క్రీజులో సెట్ అయిన తర్వాత భారీ షాట్లు ఆడాను’’ అని రింకు సింగ్ వివరించాడు. ఇక, ఈ టీ20 సిరీస్ విషయానికొస్తే.. మొదటి మ్యాచ్‌ రద్దు కాగా.. సౌతాఫ్రికా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 గురువారం జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని