IND vs ENG: మేం 30 పరుగులు తక్కువ చేశామేమో.. కానీ మా బౌలర్లు వాళ్లను కుదురుకోనీయలేదు: రోహిత్ శర్మ

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు (Team India) ఎదురేలేదు. డబుల్‌ హ్యాట్రిక్‌ విక్టరీతోలతో దూసుకుపోతోంది. తాజాగా తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది.

Published : 30 Oct 2023 08:32 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ భారత్‌ విజయం సాధించింది. లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (IND vs ENG) క్లిష్ట సమయంలో అద్భుత పోరాటంతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లను చేర్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌ దళం చెలరేగడంతో 100 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 87 పరుగులు చేశాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో ఔటై సెంచరీని చేజార్చుకున్నాడు. అనవసర షాట్లకు యత్నించి తనతోపాటు మిగతావారిలో ఎక్కువ మంది వికెట్లను సమర్పించారని రోహిత్ తెలిపాడు.

‘‘జట్టులోని ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్‌ ఇది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో అనుభవ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం ఆడిన తీరు వేరు.. ఈ మ్యాచ్‌లో చేసిన పోరాటం వేరు. తొలి ఐదు గేముల్లో మేం లక్ష్య ఛేదనకే దిగాం. ఈసారి మాత్రం తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇంగ్లాండ్‌ అద్భుత బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ స్కోరు బోర్డుపై ఆ పరుగులను ఉంచగలిగాం. అయితే, బ్యాటింగ్‌లో అనుకున్నంతమేర రాణించలేదనే చెప్పాలి. నాతో పాటు మరికొందరు అనవసరంగా వికెట్లను సమర్పించారు. మా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత ఓ 30 పరుగులు తక్కువ చేసినట్లు అనిపించింది. 

కానీ,  భారత బౌలింగ్‌ విభాగం అద్భుతం చేసింది. ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. అయితే, ఆరంభంలో రెండు లేదా మూడు వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరగడం ఖాయం. ఇదే మా బౌలర్లు పాటించిన సూత్రం. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కుదురుకోనీయలేదు. పిచ్‌ పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకుని చెలరేగిపోయారు. స్వింగ్‌తోపాటు పిచ్‌ నుంచి కూడా తమకు సహకారం లభించడంతో ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్‌ చాలా కష్టంగా మారిపోయింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కి కట్టుబడి బౌలింగ్‌ చేయడంతో ఎలా ఆడాలనే సందిగ్ధత బ్యాటర్ల మదిలో కదలడం సహజం. మా బౌలర్ల అనుభవం కూడా మాకు కలిసొచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ కీలక అంశంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. బ్యాటర్లు రాణించి స్కోరు బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాల్సిందే. అప్పుడే బౌలర్లు స్వేచ్ఛగా బంతులను సంధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్‌ స్పెల్స్‌ను వారి నుంచి ఆశించే అవకాశం దక్కుతుంది. లక్ష్యం మరీ తక్కువగా ఉంటే ఆ ఒత్తిడి బౌలింగ్‌పైనా పడుతుంది’’ అని రోహిత్ శర్మ అన్నాడు.

లఖ్‌నవూ వేదికగా జరిగిన మ్యాచ్‌లో (IND vs ENG) తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్  నిర్ణీత 50 ఓవర్లలో 229/9 స్కోరుకే పరిమితమైంది. రోహిత్‌తోపాటు సూర్య (49) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 129 పరుగులకే ఆలౌటైంది. దీంతో 100 పరుగుల తేడాతో ఘన విజయం భారత్‌ సొంతమైంది. టీమ్‌ఇండియా బౌలర్లు షమీ 4, బుమ్రా 3, కుల్‌దీప్‌ 2, జడేజా ఒక వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం 12 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని