Rohit Counter to Cummins: గతం గతః.. ఇప్పుడెలా ఉన్నామన్నదే ముఖ్యం: కమిన్స్‌కు రోహిత్‌ కౌంటర్‌..!

ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందే మాటల యుద్ధం మొదలైంది. ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ చేసిన వ్యాఖ్యలకు రోహిత్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.

Updated : 19 Nov 2023 13:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ చేసిన కామెంట్లు(Pat Cumins Comments).. దానికి ప్రతిగా రోహిత్‌ ఇచ్చిన కౌంటర్‌తో ప్రపంచకప్‌ ఫైనల్‌ మరింత హీట్‌ పెంచింది. తమకు అద్భుతమైన అదనపు బలం ఉందంటూ ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ చేసిన కామెంట్లకు హిట్‌మ్యాన్‌ తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇటీవల కమిన్స్‌ మాట్లాడుతూ 2015లో ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఆడిన ఆటగాళ్లు పెద్దసంఖ్యలో తమ జట్టులో ఉన్నారని.. ఆ అనుభవం తమకు కలిసి వస్తుందని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని నిన్న రోహిత్‌ శర్మ ప్రీ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌(Pre Match Conference)లో విలేకర్లు ప్రస్తావించారు. దీనికి హిట్‌ మ్యాన్‌ తనదైన శైలిలో స్పందించాడు. 

‘‘ప్రపంచకప్‌(World Cup) గతంలో గెలిచిన ఆటగాళ్లు ఉండటాన్ని అడ్వాంటేజ్‌ అని వారు అనుకొంటుండొచ్చు.. కానీ, మేము దానిని నమ్మం. ఫైనల్‌ ఆడిన అనుభవం కంటే ప్రస్తుత ఫామ్‌, మన ఆలోచనా తీరు చాలా ముఖ్యం. వారు ఒత్తిడిని ఎలా తట్టుకోగలరు అనేది కీలకం. అతడు (కమిన్స్‌) ఏ కోణంలో ఈ మాట అన్నాడో నాకు అర్థమైంది. నా అభిప్రాయం ప్రకారం ఎటువంటి అడ్వాంటేజ్‌ ఉండదు’’ అని రోహిత్‌ (Rohit Sharma) విశ్లేషించాడు. 

ODI WC Final 2023: భారత్‌ vs ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

భారత్‌తో పోలిస్తే.. టోర్నీలో అంతగా ఆధిపత్యం చూపని ఆస్ట్రేలియాను ఎదుర్కోవడంపై ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించగా.. రోహిత్‌ స్పందిస్తూ.. ‘‘ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఆధిపత్యం చూపలేదంటే నేను అంగీకరించను. వారు గత ఎనిమిది మ్యాచ్‌లు గెలిచారు. వారు బాగా ఆడారు. ఆస్ట్రేలియా ఏమి చేయగలదో అనే దానిపై నాకు అవగాహన ఉంది. వారు చాలా పరిపూర్ణమైన ఆటగాళ్లు. దీంతో అద్భుతమైన పోటీ ఉండనుంది’’ అని పేర్కొన్నాడు. 

మేము ద్రవిడ్‌ కోసం ఇది చేయాలనుకుంటున్నాం..

జట్టు విజయాల్లో ద్రవిడ్‌ పాత్ర ఏమిటని అడిగిన ప్రశ్నకు రోహిత్‌ సమాధానం చెబుతూ.. ‘‘జట్టు ఆటగాళ్లకు తమ పాత్రపై స్పష్టత ఉండటంలో ద్రవిడ్‌ పాత్ర అత్యంత కీలకం. రాహుల్‌ తన కెరీర్‌లో ఆడిన క్రికెట్‌(Cricket).. ఇప్పుడు నేను ఆడుతున్న క్రికెట్‌కు చాలా తేడా ఉంది. ఈ విషయాన్ని అతడు అంగీకరించి.. మేము ఆడాలనుకున్న విధానంలో ముందుకు వెళ్లడానికి అవసరమైన స్వేచ్ఛను ఇవ్వడమే అతని గురించి చాలా చెబుతుంది. అత్యంత కీలకమైన ఈ క్షణాల్లో అతడు కూడా భాగస్వామి కావాలనుకున్నాడు. ఇప్పుడు అతడి కోసం దానిని పూర్తి చేసి (కప్పు గెలిచి) ఇవ్వడం అనే బాధ్యత మాపై ఉంది’’ అని పేర్కొన్నాడు. 

ఇక షమీపై రోహిత్‌ స్పందిస్తూ.. ప్రారంభ మ్యాచ్‌ల్లో రిజర్వు బెంచ్‌కు పరిమితం కావడం అతడికి (షమికి) కష్టమైన పనే. అతడు బుమ్రాకు మద్దతుగా ఉండటం అతడి పని. అతడు జట్టు సభ్యుడిగా చేయగలిగినంతగా చేశాడని వెల్లడించాడు. 

భారత అభిమానులను సైలెంట్‌గా ఉంచడంలోనే సంతృప్తి : కమిన్స్‌

ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ (World Cup Final Match 2023) సందర్భంగా భారత ఫ్యాన్స్‌ను సైలెంట్‌గా ఉంచడంలోనే తనకు సంతృప్తి ఉంటుందని ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ పేర్కొన్నాడు. ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌(Pre Match Press Conference)లో అతడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏకపక్షంగా ఉన్న ప్రేక్షకుల మధ్యలో తమ జట్టు భారత్‌తో తలపడుతుందని అన్నాడు. ‘‘హోమ్‌ టీమ్‌తో అద్భుతమైన గేమ్‌ జరగబోతోంది. ప్రేక్షకులు మొత్తం వారికి మద్దతుగా ఉంటారు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో భారత్‌ అజేయంగా ఉంది. ఫ్యాన్స్‌ ఏకపక్షంగా ఉండబోతున్నారు. వారందరిని సైలెంట్‌గా ఉంచగలిగితే (భారత్‌ను షాక్‌కు గురిచేసి) మాకు సంతృప్తిగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని