Rohit Sharma: మూడో రోజు ఇంకా మైదానంలోకి దిగని రోహిత్.. కారణమిదే!

ఐదో టెస్టులోనూ భారత్ విజయం దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు కకావికలం చేసేస్తున్నారు.

Published : 09 Mar 2024 12:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న (IND vs ENG) ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత సెంచరీతో అలరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 477 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ లంచ్‌ సమయానికే సగం వికెట్లను కోల్పోయింది. అయితే, భారత సారథి రోహిత్ మాత్రం మైదానంలోకి ఇంకా దిగలేదు. దీంతో అతడికి ఏమైందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. తాజాగా రోహిత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. 

‘‘కెప్టెన్ రోహిత్ శర్మ మూడో రోజు మైదానంలోకి దిగలేదు. వెన్ను నొప్పి కారణంగా అతడు డగౌట్‌కే పరిమితమయ్యాడు’’ అని బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఫిట్‌నెస్‌ కారణంగా మిస్‌ కావడం ఇదే తొలిసారి. ఇతర స్టార్‌ ప్లేయర్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. రోహిత్ మాత్రం విరామం తీసుకోకుండా సిరీస్‌ మొత్తానికి అందుబాటులో ఉన్నాడు. మన బౌలర్ల ఊపు చూస్తుంటే.. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ఆడే అవకాశాలు తక్కువనే చెప్పాలి. రోహిత్ గైర్హాజరీలో జట్టును వైస్‌ కెప్టెన్ బుమ్రా నడిపిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్‌ వ్యూహంతో ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని