Kohli - Ganguly : కోహ్లీతో కలిసి ఆడలేదు.. కానీ అతడి ఆటంటే చాలా ఇష్టం : గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దిగ్గజ ఆటగాడి స్థాయికి ఎదిగాడని పేర్కొన్నాడు...

Published : 03 Mar 2022 01:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దిగ్గజ ఆటగాడి స్థాయికి ఎదిగాడని పేర్కొన్నాడు. త్వరలోనే మునుపటి ఫామ్‌ను అందుకుని శతకాలు నమోదు చేస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.   

‘భారత క్రికెటర్లలో చాలా కొద్ది మంది మాత్రమే వంద టెస్టు మ్యాచులు ఆడారు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇదొక మైలురాయి. నేను అతడితో కలిసి ఆడలేదు. కానీ, ఎప్పుడూ అతడి ఆటను ఫాలో అవుతుంటాను. అతడి టెస్టు కెరీర్ ఆరంభం నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని దిగ్గజ ఆటగాడి స్థాయికి ఎదిగాడు. కోహ్లీ టెక్నిక్‌, ఆట పట్ల సానుకూల దృక్పథం, ఫుట్‌ వర్క్‌.. ఇలా చెప్పుకుంటూపోతే అతడిలో చాలా విషయాలు నాకు బాగా నచ్చుతాయి’ అని సౌరవ్‌ గంగూలీ చెప్పాడు.

‘అన్నింటికి మించి 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో ఘోరంగా విఫలమైన తర్వాత.. తన ఆటను మార్చుకుని పునరాగమనం చేసిన తీరు అమోఘం. ఆ సిరీస్‌కు నేను కామెంటేటర్‌గా పని చేశాను. కాబట్టి అతడి ఆటను దగ్గరి నుంచి గమనించాను. ఆ తర్వాత ఐదేళ్ల వరకు అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. రాహుల్ ద్రవిడ్‌, సచిన్‌ తెందూల్కర్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లందరూ ఇలాంటి దశను అధిగమించి గొప్పగా రాణించిన వారే. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా కోహ్లీ ఆటలో కొన్ని చిన్న చిన్న మార్పులు అవసరం. అది పెద్ద కష్టమేం కాదు. అతడు త్వరలోనే ఈ క్లిష్ట దశను అధిగమిస్తాడు. మునుపటి ఫామ్‌ను అందుకుని.. మళ్లీ శతకాలు బాదుతాడు. గత రెండేళ్లుగా సెంచరీలు నమోదు చేయకున్నా.. కీలక ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. శతకాలు బాదడమెలాగో అతడికి తెలుసు కాబట్టే ఇప్పటి వరకు 70 శతకాలు బాదాడు. లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. అతడిలో గొప్ప శక్తి సామర్థ్యాలున్నాయి. తగిన సమయం కోసం వేచి చూస్తున్నాడంతే’ అని గంగూలీ పేర్కొన్నాడు.

* సచిన్‌తో పోల్చలేం..

భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యాక.. విరాట్‌ కోహ్లీ అతడి స్థానంలో (4వ) ఆడుతున్నాడు. ఈ విషయంపై గంగూలీ స్పందిస్తూ.. ‘కోహ్లీలాంటి ఆటగాడిపై భారీ అంచనాలు ఉండటం సహజమే. అయితే, వేర్వేరు జనరేషన్ల ఆటగాళ్లను పోల్చడం సరికాదు. టెస్టుల్లో సచిన్‌ స్థానంలో బ్యాటింగ్ చేసినంత మాత్రానా సచిన్‌కి వారసుడని చెప్పలేం. టెస్టుల్లో నాలుగో స్థానంలో, వన్డే ఫార్మాట్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి దిగే విరాట్‌ కోహ్లీ గొప్పగా రాణిస్తున్నాడు’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని