ICC rankings: నాలుగేళ్ల తర్వాత టాప్‌-10లో ముగ్గురు భారత ఆటగాళ్లు.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్‌ చేసిన కుల్‌దీప్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగేళ్ల తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్‌దీప్ యాదవ్(kuldeep yadav) .. అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఓ రికార్డును బద్ధలు కొట్టాడు. 

Updated : 13 Sep 2023 16:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగేళ్ల తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)తోపాటు సీనియర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) టాప్‌-10లో నిలిచారు. 759 రేటింగ్‌ పాయింట్లతో గిల్‌ రెండో స్థానంలో నిలిచి కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సూపర్‌ సెంచరీతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగై ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వరుసగా మూడు అర్ధ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు. 2019లో శిఖర్‌ ధావన్‌, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్‌-10లో నిలిచారు. పాక్‌ ఆటగాళ్లు  టాప్‌-10లో ముగ్గురు కొనసాగుతున్నారు. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 863 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇమాన్ ఉల్‌ హక్‌ ఒక స్థానం పడిపోయి ఐదో స్థానంలో నిలిచాడు. ఫకార్‌ జమాన్‌ మూడు స్థానాలు దిగజారి పదో స్థానానికి పడిపోయాడు. 

అనిల్ కుంబ్లే రికార్డు బద్ధలు కొట్టిన కుల్‌దీప్

ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (kuldeep yadav) నాలుగు వికెట్లు పడగొట్టి వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు భారత్‌ తరఫున వేగంగా 150 వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. కుల్‌దీప్‌ యాదవ్ 88 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు అందుకున్నాడు. దీంతో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. కుంబ్లే 106 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు.

వన్డేల్లో వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు

ఆసియా కప్‌ ఫైనల్‌ : భారత్‌ vs పాక్‌ పోరును మళ్లీ చూస్తామా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?

  • మహ్మద్‌ షమి- 80 మ్యాచ్‌ల్లో
  • కుల్‌దీప్‌ యాదవ్‌-  88 మ్యాచ్‌ల్లో
  • అజిత్ అగార్కర్‌-  97 మ్యాచ్‌ల్లో 
  • జహీర్‌ ఖాన్‌-  103 మ్యాచ్‌ల్లో 
  • అనిల్ కుంబ్లే-  106 మ్యాచ్‌ల్లో
  • ఇర్ఫాన్‌ పఠాన్-  106 మ్యాచ్‌ల్లో
  • రవిచంద్రన్ అశ్విన్‌- 111 మ్యాచ్‌ల్లో 
  • ఆశిష్ నెహ్రా-  113 మ్యాచ్‌ల్లో 
  • జవగళ్‌ శ్రీనాథ్‌-  115 మ్యాచ్‌ల్లో 
  • హర్భజన్ సింగ్- 122 మ్యాచ్‌ల్లో 
  • మనోజ్‌ ప్రభాకర్- 123 మ్యాచ్‌ల్లో 
  • వెంకటేశ్ ప్రసాద్‌- 126 మ్యాచ్‌ల్లో 
  • కపిల్ దేవ్- 128 మ్యాచ్‌ల్లో 
  • రవీంద్ర జడేజా- 129 మ్యాచ్‌ల్లో 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని