MS Dhoni-Pathirana: అప్పుడు నేనెవరికీ తెలీదు.. ధోనీ నుంచి చాలా నేర్చుకున్నా: పతిరణ

ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు మతీశా పతిరణ (Matheesha Pathirana) పేర్కొన్నాడు. 

Published : 17 Aug 2023 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఛాంపియన్‌గా నిలవడంలో శ్రీలంక యువ బౌలర్‌, జూనియర్‌ మలింగగా పేరొందిన మతీశా పతిరణ (Matheesha Pathirana) కీలకపాత్ర పోషించాడు. కీలక బౌలర్లు గాయాలబారినపడి జట్టుకు దూరమైన తరుణంలో కెప్టెన్ ధోనీ (MS Dhoni) ఈ కుర్రాడిపై నమ్మకం ఉంచాడు. ధోనీ అంచనాలను మించి పతిరణ రాణించాడు. అతడు డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేసి సీఎస్కేకు ప్రధాన బౌలింగ్‌ అస్త్రంగా మారాడు. ఈ క్రమంలోనే ధోనీకి, పతిరణకు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం లంక ప్రిమియర్‌ లీగ్‌ (LPL)లో ఆడుతున్న పతిరణ.. తనపై ధోనీ ప్రభావం గురించి మాట్లాడాడు. టీ20 క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ధోనీ వద్ద నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. 

హబీబ్‌ అంటే ఒక బ్రాండ్... కోల్‌కతాను ఊపేసిన హైదరాబాద్ ఫుట్‌బాల్‌ దిగ్గజం

“ఒక యువ ఆటగాడిలో ఎవరైనా అలాంటి ఆత్మవిశ్వాసం నింపింతే అది ఆ ఆటగాడి కెరీర్‌ ముందుకుసాగడానికి ఊతమిస్తుంది. ఆ స్థాయి ఆటగాడు (ధోనీ) నాపై నమ్మకం ఉంచాడు. ఆ క్షణంలో నేను ఏదైనా చేయగలనని నమ్మాను. నాకే కాదు ధోనీ మా అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపుతాడు. 4-5 మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు గాయపడిన సందర్భంలో అతను యువకులపై నమ్మకం ఉంచాడు. అలా చేయడం చాలా గ్రేట్. ధోనీ నుంచి నేను చాలా నేర్చుకున్నా. అందులో మొదటిది వినయంగా ఉండటం. దానివల్లే అతను చాలా విజయవంతమయ్యాడు. 42 ఏళ్లు ఉన్న ధోనీ ఇప్పటికీ ఫిట్టెస్ట్ క్రికెటర్. నిజంగా ఇది స్ఫూర్తిదాయకం. నేను అక్కడికి (సీఎస్కే క్యాంప్‌) వెళ్లినప్పుడు చిన్నవాడిని.  నేనెవరికీ తెలీదు. వారు నాకు అనేక విషయాలు నేర్పించి శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఏ టీ20 మ్యాచ్‌లోనైనా ఎలా రాణించాలో, నా నాలుగు ఓవర్లు ఎలా బ్యాలెన్స్ చేయాలో నాకు తెలుసు. నేను నా శరీరాన్ని గాయాల బారినపడకుండా కాపాడుకుంటే జట్టు, దేశం కోసం ఎంతో సాధించగలని ధోనీ నాతో చెప్పాడు’’ అని పతిరణ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని