IND vs ENG: డాన్‌ బ్రాడ్‌మన్‌ సూత్రమదే.. సర్ఫరాజ్‌ అలా ఔట్‌ కావడం సరికాదు: సునీల్ గావస్కర్

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో (IND vs ENG) సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడేశాడు. కానీ, ఐదో టెస్టులో అనవసర తప్పిదంతో వికెట్‌ను ఇంగ్లాండ్‌కు ఇచ్చేశాడు.

Published : 09 Mar 2024 00:30 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ (56) హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, రెండోరోజు మూడో సెషన్‌ ప్రారంభమైన తర్వాత.. తొలి బంతికే వికెట్‌ను సమర్పించుకున్నాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అనూహ్యంగా బౌన్స్‌ అయిన బంతిని ఆడే క్రమంలో స్లిప్‌లో జో రూట్‌ చేతికి చిక్కాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌ ఔట్‌ కావడంపై టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుదరుకున్న తర్వాత ఔట్‌ కావడం ఎలాంటి బ్యాటర్‌కైనా బాధగానే ఉంటుందని.. ఇలాంటి సమయంలోనే సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయని గావస్కర్ వెల్లడించాడు. ఐదో టెస్టు సందర్భంగా కామెంట్రీ బాక్స్‌లో సునీల్‌ గావస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

‘‘బంతి పిచ్‌పై పడిన లేచిన తర్వాత.. షాట్‌ కొట్టేందుకు అనువుగా పైకి లేవలేదు. దానిని ఆడేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టీ బ్రేక్‌ తర్వాత తొలి బంతినే ఇలా ఆడాడు. అటువంటి సమయంలో కాస్త బంతిపై దృష్టి పెడితే బాగుండేది. సర్ఫరాజ్‌ ఔటైనప్పుడు నాకు వెంటనే సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్ గుర్తుకొచ్చారు. ఒకసారి ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి బంతిని నేను ఎదుర్కొనే దృక్కోణం ఒకేలా ఉంటుంది. ఒకవేళ నేను 200 స్కోరు మీద ఉన్నా సరే.. ఆ మరుసటి బంతిని ఎదుర్కొనేటప్పుడు నేను ‘0’ మీదే ఉన్నాననుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తా’ అని అన్నారు. ఇప్పుడు సర్ఫరాజ్‌ ఖాన్‌ అనసవరమైన షాట్‌తో వికెట్‌ను సమర్పించాడు. అదీనూ సెషన్ ప్రారంభమైన తొలి బంతికే ఔట్‌ కావడం బాధాకరం’’ అని గావస్కర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని