IND vs ENG: తొలి రోజే భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరిస్తే బాగుండేది: సునీల్ గావస్కర్‌

మాజీ కెప్టెన్‌ మృతికి సంతాప సూచికంగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ఆలస్యంగా ధరించడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అసహనం వ్యక్తంచేశాడు. 

Updated : 17 Feb 2024 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్‌ మృతికి సంతాప సూచికంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో (IND vs ENG) టీమ్‌ఇండియా ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించారు. మూడోరోజు మైదానంలోకి దిగేటప్పుడు ఇలా వచ్చారు. అయితే, దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాస్త అసంతృప్తి వ్యక్తంచేశాడు. మూడో టెస్టు తొలిరోజే మన ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. 

‘‘అసలు చేయకుండా ఉండటం కంటే ఆలస్యంగానైనా చేయడం కాస్త మేలే. కానీ, మొదటిరోజే ఇలా చేసి ఉంటే మరింత గౌరవంగా ఉండేది. టీమ్‌ఇండియాకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగింటికి ఆయనే సారథి. మరొక మ్యాచ్‌కు పంకజ్‌రాయ్‌ నాయకత్వం వహించారు’’ అని గావస్కర్‌ తెలిపాడు. దత్తాజీరావు గైక్వాడ్ (95) ఫిబ్రవరి 13న వయోభారం వల్ల తుది శ్వాస విడిచారు. అప్పటివరకు జీవించి ఉన్న అతిపెద్ద వయస్కుడైన భారత టెస్టు క్రికెటర్ కూడా ఆయనే కావడం గమనార్హం. 

పట్టు బిగిస్తోన్న భారత్

మూడో టెస్టులో భారత్ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 319 పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమ్ఇండియా 126 పరుగుల  ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ 207/2 స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ మరో 112 పరుగులు చేసి ఆఖరి 8 వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్‌ బెన్ డకెట్ (153) భారీ సెంచరీ చేయగా.. స్టోక్స్‌ (41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ జట్టును వీడాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో పది మందితోనే బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని