T20 League : వర్షంతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆలస్యం.. ఇప్పుడేం చేస్తారంటే?

 టీ20 టోర్నీలో అసలైన అంకం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్‌లో భాగంగా రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌ మ్యాచ్‌...

Updated : 25 May 2022 19:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు వర్షం బెడద ఉంది. చిరు జల్లుల కారణంగా ఆలస్యంగా ప్రారంభిస్తారని సమాచారం. ప్లేఆఫ్స్‌ మ్యాచులకు వాతావరణపరంగా ఏమైనా అడ్డంకులు వస్తే పరిస్థితి ఏంటి అని బీసీసీఐ ఇప్పటికే ఆలోచన చేసింది. దాని ప్రకారం  ఏం జరగొచ్చంటే...

  1. షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాలి. ఇరు జట్లూ 20 ఓవర్లపాటు ఆడతాయి. వర్షం లేదా ఇతర వాతావరణ సమస్యల కారణంగా మ్యాచ్‌ ఆలస్యమైనా పూర్తి ఓవర్ల కోటాతోనే నిర్వహించే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్‌ కనీసం రాత్రి 9.40 గంటలకైనా ప్రారంభమైతేనే ఆ ఛాన్స్‌ ఉంటుంది. అంటే ప్లేఆఫ్స్‌లో మ్యాచ్‌కు అదనంగా 120 నిమిషాలను కేటాయించింది.
  2. ఆలస్యమయ్యి రాత్రి 9.40 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైతే ఓవర్లలో ఎలాంటి కోత లేకుండా నిర్వహిస్తుంది. సాధారణంగా ఇచ్చే 10 నిమిషాల ఇంటర్వల్‌, టైమ్‌-ఔట్‌లు ఎలానూ ఉంటాయి. అదేవిధంగా ఫైనల్‌ మ్యాచ్‌ మామూలు షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 8 గంటలకు కాబట్టి.. వర్షం వల్ల ఆలస్యమైనా 10.10 గంటలకు కచ్చితంగా ప్రారంభమైతే పూర్తి ఓవర్లతోనే మ్యాచ్‌ జరుగుతుంది. 
  3. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే అందుబాటులో ఉంది. మ్యాచ్‌ వాయిదా పడితే మే 30న మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు కూడానూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. 
  4. వర్షం కారణంగా రాత్రి 9.40 గంటల్లోగా మ్యాచ్‌ ప్రారంభం కాకపోతే.. ఓవర్ల సంఖ్యను తగ్గించవచ్చు. అయితే ప్రతి జట్టు కనీసం 5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదీనూ రాత్రి 11.56 గంటలకు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంటుంది.
  5. ఇలా అయితే ఇంటర్వల్‌ 10 నిమిషాలు మాత్రమే ఇస్తారు. టైమ్‌ఔట్‌లు ఉండవు. రాత్రి 12.50 గంటలకు మ్యాచ్‌ పూర్తి కావాలి. అలాగే ఫైనల్‌ మ్యాచ్‌ 12.26 గంటలకు ప్రారంభమై 1.20 గంటలకు ఫినిష్ అయిపోవాలి. 
  6. ప్లేఆఫ్స్‌లో అప్పటికీ 5 ఓవర్ల మ్యాచ్‌ కూడా ప్రారంభించడానికి వీలుకాకపోతే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్‌ కూడానూ రాత్రి 12.50 గంటల్లోపే ప్రారంభం కావాలి. సూపర్‌ ఓవర్‌ కూడా కుదరని పక్షంలో వేరే ఆలోచన చేసింది.
  7. సూపర్‌ ఓవర్‌ సాధ్యపడననప్పుడు లీగ్‌ మ్యాచ్‌ల పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. ఉదాహరణకు ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ - బెంగళూరు తలపడతాయి. పైన పేర్కొన్న ప్రకారం లఖ్‌నవూ విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే లీగ్‌ దశలో లఖ్‌నవూ ఎక్కువ విజయాలు సాధించి పాయింట్లను దక్కించుకుంది. 
  8. ఫైనల్‌ మ్యాచ్‌కు ఎలాగూ రిజర్వ్‌ డే ఉంది. షెడ్యూల్‌ ప్రకారం మే 29న తుది పోరుకు సంబంధించిన టాస్ పడినా మ్యాచ్‌ ప్రారంభం కాకపోతే.. రిజర్వ్‌డేలో మళ్లీ టాస్‌ నుంచి స్టార్ట్‌ చేస్తారు. ముందురోజు మ్యాచ్‌ మొదలయ్యాక ఆగిపోతే... రిజర్వ్‌ డే నాడు ఆగిన చోట నుంచే మ్యాచ్‌ ప్రారంభిస్తారు.
  9. రిజర్వ్‌డేలోనూ సూపర్‌ ఓవర్‌ కూడా సాధ్యం కాకపోతే... పాయింట్ల పట్టిక ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. ఫైనల్‌కి వెళ్లిన ఆ రెండు జట్లలో... లీగ్‌ దశలో ఏ టీమ్‌ ఎక్కువ పాయింట్లు సాధించిందో దానినే టైటిల్‌ విజేతగా ప్రకటిస్తారు.
  10. ప్లేఆఫ్స్‌లో భాగంగా రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతాయి. గుజరాత్-రాజస్థాన్ జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో పాండ్య సేన గెలిచింది. మే 25న లఖ్‌నవూ-బెంగళూరు ఎలిమినేటర్‌లో తలపడతాయి. 27న రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఉంటుంది. మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని