Mohammad Rizwan: సెమీస్‌కు ముందు రెండు రోజులు ఐసీయూలో .. దేశం మీద ప్రేమతో బరిలోకి   

టీ20 ప్రపంచకప్‌ ఆఖరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించి న్యూజిలాండ్ తుది సమరానికి అర్హత సాధించగా.. రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్

Published : 12 Nov 2021 18:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ ఆఖరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించి న్యూజిలాండ్ తుది సమరానికి అర్హత సాధించగా.. రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలుకావడంతో ఆ దేశ అభిమానులు నిరాశ చెందొచ్చు. కానీ, టోర్నీలో పాక్‌ సెమీస్‌లో మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడి విజయాలు సాధించింది. కీలకమైన సెమీస్‌లో మాత్రం చిన్న చిన్న తప్పిదాల వల్ల మ్యాచ్‌ని చేజార్చుకుంది. మొత్తంమీద టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ మంచి ప్రదర్శనే చేసిందని చెప్పాలి. సూపర్‌ 12 దశలో పాకిస్థాన్‌ వరుస విజయాలు సాధించడంలో ఆ జట్టు ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లోనూ రిజ్వాన్‌ (67; 52 బంతుల్లో 3 ఫోర్లు,4 సిక్స్‌లు) రాణించి జట్టుకు భారీ స్కోరునందించాడు.

అయితే.. ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌ ముగిసిన అనంతరం రిజ్వాన్‌కు సంబంధించిన ఓ విషయం బయటికొచ్చింది. ఆసీస్‌తో సెమీస్‌ మ్యాచ్‌ జరిగే 48 గంటల ముందు రిజ్వాన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని  మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాకిస్థాన్‌ జట్టు సిబ్బందిలోని ఒకరు వెల్లడించారు. ‘‘రిజ్వాన్‌ నవంబర్ 9న అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో చేర్చాం. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూలో రెండు రోజులపాటు ఉంచి చికిత్స అందించారు. సెమీస్‌కు ఒకరోజు ముందు కోలుకున్నాడు’ అని ఆయన చెప్పారు. ‘‘అతడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌కు దూరంగా ఉండాలని సూచించాం. అందుకు రిజ్వాన్ అంగీకరించలేదు. కీలకమైన మ్యాచ్‌లో తప్పకుండా ఆడితీరుతానని అతడు (రిజ్వాన్‌) చెప్పాడు’’ అని  కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ అన్నాడు.

తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా దేశం మీద ప్రేమతో రిజ్వాన్‌ బరిలోకి దిగి బ్యాటింగ్‌లో సత్తాచాటడంతో అతనిపై పాక్‌ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని