IND vs AUS: ఉత్కంఠ పోరు.. ఐదో టీ20లోనూ భారత్‌ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Updated : 04 Dec 2023 00:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో(India vs Australia) జరిగిన ఐదో టీ20(T20I)లో భారత్‌ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఆ జట్టులో బెన్‌ మెక్‌డార్మెట్‌ (54), ట్రావిస్‌ హెడ్‌(28), మాథ్యూ వేడ్‌(22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 3, బిష్ణోయ్‌ 2, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు. ఈ విజయంతో భారత్‌ 4-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో 31 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసి అక్షర్‌ పటేల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ భారత్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వచ్చింది.  

విరుచుకుపడ్డ బెన్‌ డెర్మాట్‌..

161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ 22 పరుగులకు జోష్‌ ఫిలిప్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. ముకేశ్‌ కుమార్‌ వేసిన ఓ చక్కటి బంతికి ఫిలప్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన బెన్‌ డెర్మాట్(54: 36 బంతుల్లో 5 సిక్స్‌లు)తో కలిసి మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(28: 18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌) ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆ జట్టు స్కోర్‌ 47 పరుగుల వద్ద ట్రావిస్‌ హెడ్‌ను బిష్ణోయ్‌ ఔట్‌ చేశాడు. అనంతరం వచ్చిన అరోన్‌ హార్డీ(6) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో 55 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే క్రీజులో నిలుదొక్కుకున్న  డెర్మాట్‌ సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. ఈ క్రమంలో 102 పరుగుల వద్ద టిమ్‌ డేవిడ్‌(17), 116 పరుగుల వద్ద డెర్మాట్‌ ఔట్‌ కావడంతో ఆసీస్‌కు పీకల్లోతు కష్టాలు వచ్చాయి. మరో రెండు ఓవర్ల తర్వాత 129 పరుగుల వద్ద మాథ్యూ షార్ట్‌(16), బెన్‌ డ్వార్ష్‌యిస్‌ వరుస బంతుల్లో ఔట్‌కావడంతో ఆసీస్‌ ఓటమి దిశగా పయనించింది. అయితే మరో వైపు కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌(22: 15 బంతుల్లో 4 ఫోర్లు) ఫోర్లతో విరుచుకుపడడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా దిశగా సాగింది. అయితే అర్ష్‌దీప్‌ సింగ్‌ వేడ్‌ను ఔట్‌ చేయడంతో ఆసీస్‌ ఓటమి ఖరారైంది. 

మెరిసిన అయ్యర్‌..

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతున్న జైస్వాల్‌(21: 15 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌) 3.6 ఓవర్ల వద్ద బెహ్రన్‌డార్ఫ్‌ బౌలింగ్‌లో నాథన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అదే స్కోర్‌ వద్ద మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(10) సైతం ఔట్‌ కావడంతో భారత్‌ కాస్త ఒత్తిడిలోకి వెళ్లింది. అనంతరం వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(53: 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన సూర్యకుమార్‌యాదవ్‌(5), ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్‌(6) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. దీంతో భారత్‌ 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జితేశ్‌ శర్మ(24: 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌)తో కలిసి శ్రేయస్‌ ఇన్సింగ్‌ నిర్మించాడు. వీరిద్దరూ కలిసి 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 97 పరుగుల వద్ద  జితేశ్‌ శర్మ ఔట్‌ కావడంతో అక్షర్‌ పటేల్‌(31: 21 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌) క్రీజులోకి వచ్చాడు. అయ్యర్‌, అక్షర్‌ కలిసి మరో మంచి భాగస్వామ్యం నెలకొలిపే దిశగా ఆడారు. ఈ క్రమంలో 143 పరుగుల వద్ద అక్షర్‌, 156 పరుగుల వద్ద అయ్యర్‌ ఔట్‌ కావడంతో భారత్‌ భారీ స్కోర్‌ చేయలేకపోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని