Cheteshwar Pujara: పుజారాను తప్పించడం మంచిదే: టీమ్ఇండియా మాజీ కోచ్

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారాపై (PUJARA) వేటు పడిన సంగతి తెలిసిందే. విండీస్‌ పర్యటనకు ఎంపిక చేయకపోడంతో సెలెక్షన్‌ కమిటీపై విమర్శలు విపరీతంగా వచ్చాయి.

Published : 01 Jul 2023 22:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final 2023) తేలిపోయిన భారత బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాపై వేటు పడింది. జులై 12 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో కొందరు మాజీలు సెలెక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం  చేయగా.. మరికొందరు సమర్థించారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ లాల్‌చంద్ రాజ్‌పుత్‌ కమిటీ నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు. విండీస్‌తో సిరీస్‌కు పుజారాకు విశ్రాంతినివ్వడం మంచిదేనని పేర్కొన్నాడు. దీనిని సానుకూల ముందడుగుగా స్వీకరించాలని పుజారాకు సూచించాడు. 

‘‘విండీస్‌ సిరీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో సీజన్‌ను భారత్ ప్రారంభిస్తుంది. కాబట్టి ఇప్పుడు సీనియర్‌ ఆటగాడు పుజారాను తప్పించడం వల్ల వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్‌లోగా యువ ప్లేయర్‌ను తయారు చేసుకోవడానికి అవకాశం దక్కినట్లు అవుతుంది. యువకులకు ఇంకా ఛాన్స్‌లు ఇచ్చి మెరుగ్గా ఆడేలా తయారు చేయాలి. రుతురాజ్‌, జైస్వాల్‌ వంటి వృద్ధిలోకి రావాలి. వారిని టెస్టుల్లోకి తీసుకొని అవకాశాలు ఇవ్వడం వల్ల రిజర్వ్‌ బెంచ్‌ను పటిష్ఠంగా మారుతుంది. దేశవాళీలో అదరగొడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎంపిక చేస్తే బాగుండేది. అయితే, అతడిని పరిగణలోకి తీసుకోకపోవడానికి కారణమేంటో నాకు తెలియదు. ఎలాంటి కారణమైనా సరే ఓసారి అవకాశం ఇవ్వాల్సింది’’ అని లాల్‌చంద్ అన్నారు.

సెమీస్‌కు చేరేది వీరే!

‘‘వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌కు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేరతాయి. ఇక నాలుగో జట్టుగా దక్షిణాఫ్రికా లేదా పాకిస్థాన్‌లో ఒకరు వస్తారు. స్వదేశంలో మెగా టోర్నీ ఆడనుండటం భారత్‌కు అడ్వాంటేజ్‌. బుమ్రా త్వరగా కోలుకుని వస్తే బౌలింగ్‌ బలోపేతంగా ఉంటుంది. అతడు ఆరంభ, డెత్‌ ఓవర్లలో వికెట్లను అందించగల సత్తా ఉన్నబౌలర్‌’’ అని రాజ్‌పుత్‌ తెలిపాడు.

అలా వ్యవహరించాల్సింది కాదు: రామన్‌

సీనియర్‌ ఆటగాడు పుజారా పట్ల సెలెక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు సరైంది కాదని మాజీ కోచ్ రామన్‌ వ్యాఖ్యానించారు. ‘‘విండీస్‌తో సిరీస్‌కు భారత్ నలుగురు ఓపెనర్లను తీసుకుంది. అందుకే పుజారాను తప్పించింది. భారత క్రికెట్‌ కోసం చాన్నాళ్లు సేవలు అందించిన పుజారాను ఇలా ట్రీట్‌ చేయడం సరైంది కాదు. చాలాసార్లు దేశవిదేశాల్లో భారత్‌కు అద్భుతమైన విజయాలు అందించిన బ్యాటర్ పుజారా’’ అని మాజీ  కోచ్ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని