Hockey India Women: హాకీ అమ్మాయిలు చరిత్ర సృష్టించేందుకు ఆ సినిమా.. ఈ మాటలే కారణం!

వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం.. తర్వాతి మ్యాచుల్లో గెలవకపోతే ఇంటికే పయనం.. అలాంటి కఠిన సందర్భాల్లో నిలదొక్కుకుంటూ సెమీస్‌కు దూసుకెళ్లింది భారత మహిళల హాకీ జట్టు. అణువణువునా ఆత్మవిశ్వాసం నింపుకొని ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది....

Published : 03 Aug 2021 01:14 IST

టోక్యో: వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం.. తర్వాతి మ్యాచుల్లో గెలవకపోతే ఇంటికే పయనం.. అలాంటి కఠిన సందర్భాల్లో నిలదొక్కుకుంటూ సెమీస్‌కు దూసుకెళ్లింది భారత మహిళల హాకీ జట్టు. అణువణువునా ఆత్మవిశ్వాసం నింపుకొని ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. రాత్రికి రాత్రే వారు ఇంతలా మారిపోవడానికి కారణం ‘ఒక  సినిమా’. ‘మేఘాలపై నిలబడితే శిఖరాలపై పడిపోగలం.. అదే శిఖరాలపై నిలబడాలని లక్ష్యం పెట్టుకొంటే నేలపై పడిపోతాం’ అన్న కోచ్‌ మారిజన్‌ మాటలే.

‘మొదట్లో మా ప్రదర్శనకు ఇప్పుటికీ తేడా మాపై మాకు విశ్వాసం.. మా కలల్ని నమ్మడం.. గతాన్ని తల్చుకోకుండా వాస్తవంలో ఉండటం. మేం చేసింది ఇంతే. ఓడిపోయినంత మాత్రాన నమ్మకం కోల్పోవద్దని మా అమ్మాయిలకు చెప్పాను. ఈ క్షణంలో బతకడం అన్నిటికన్నా ముఖ్యం. నేను వారికో సినిమా చూపించాను. అందులో ఈ క్షణంలో బతకడం గురించే ఉంటుంది. అది వారికి సాయపడింది. ఐర్లాండ్‌పై మేం ఆ సినిమా ఆధారంగానే విజయం సాధించాం’ అని మారిజిన్‌ తెలిపారు.

ఆ సినిమా పేరును చెప్పేందుకు మారిజిన్‌ తిరస్కరించారు. ‘లాక్‌డౌన్‌లో భారత్‌లో అనుభవాల గురించి నేనో పుస్తకం రాశాను. అందులో ఆ చిత్రం పేరు ఉంది’ అని వెల్లడించారు. అత్యున్నతమైంది లక్ష్యంగా ఎంచుకోవాలని అమ్మాయిలకు చెప్పానన్నారు.

‘భారత్‌లో అత్యున్నతంగా ఆలోచించాలని చెప్పాను. మేఘాలను లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం అత్యున్నత శిఖరంపై పడగలం. అదే శిఖరాన్ని లక్ష్యంగా పెట్టుకొంటే నేలపై పడాల్సి వస్తుంది. ఏం జరిగినా పట్టించుకోవద్దని చెప్పాను’ అని ఆయన వెల్లడించారు.

కోచ్‌ చూపించిన సినిమా వల్లే తమ ఆట మలుపు తిరిగిందని కెప్టెన్‌ రాణి రాంపాల్‌  తెలిపింది. వర్తమానంలో అత్యుత్తమంగా ఉండేలా ప్రేరణ కల్పించిందని పేర్కొంది. గతాన్ని మర్చిపోయి ముందున్న దానిపై ఆలోచించేలా చేసిందని వెల్లడించింది. కేవలం 60 నిమిషాలు దృష్టి సారించాలని సెమీస్‌కు ముందు కోచ్‌లు చెప్పారని తెలిపింది.

‘కేవలం పతకాలే కాకుండా అంతకన్నా మెరుగైన లక్ష్యాల గురించి మేం ఆలోచిస్తున్నాం. ఈ విజయం భారత్‌లోని మహిళలకు స్ఫూర్తినిస్తుంది. ఇదొక వారసత్వంగా ఉండిపోతుంది. నేనూ ఇదే కోరుకుంటున్నా. గత నాలుగున్నరేళ్లలో మేం ఎన్నో ఒడుదొడుకులు అనుభవించాం. అమ్మాయిలు ఎంతో శ్రమించారు. భిన్నమైన పరిస్థితుల నుంచి వారొచ్చారు. ఇప్పుడు వారు సాధించారు. నా శరీరమంతా భావోద్వేగంతో నిండిపోయింది’ అని కోచ్‌ మారిజిన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని