IPL 2021: వెంకటేశ్‌ చెలరేగుతాడా.. రవి బిష్ణోయ్‌ అడ్డుకట్ట వేస్తాడా?

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ రెండోసారి తలపడేందేకు సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లూ పైచేయి సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తున్నాయి...

Published : 01 Oct 2021 15:09 IST

అందరి కళ్లూ వీరిపైనే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ రెండోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లూ పైచేయి సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌ తప్పక గెలవాలి. ఎందుకంటే రాహుల్‌ టీమ్‌ ఇప్పుడు 11 మ్యాచ్‌ల్లో.. 4 విజయాల(8 పాయింట్లు)తో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు మోర్గాన్‌ టీమ్‌ 11 మ్యాచ్‌ల్లో.. 5 విజయాల(10 పాయింట్లు)తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దీంతో రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరువవ్వాలని పట్టుదలగా ఉన్నాయి.

వెంకటేశ్‌ ఎదుర్కోగలడా?

(Photo: Venkatesh Iyer Instagram)

రెండో దశలో కోల్‌కతా జట్టులో తన దూకుడు బ్యాటింగ్‌తో అందరి దృష్టి ఆకర్షించిన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 126 పరుగులు చేశాడు. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో కలిసి కోల్‌కతాకు అవసరమైన విజయాలు అందిస్తున్నాడు. అయితే, ఇప్పటివరకు అతడు పేస్‌ బౌలింగ్‌లోనే ప్రధానంగా బ్యాట్‌ ఝుళిపించడం గమనార్హం. దీంతో ఈరోజు మ్యాచ్‌లో పంజాబ్‌ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ని ఎలా ఎదుర్కొంటాడనేది కీలకంగా మారింది. మరోవైపు హర్‌ప్రీత్‌ బ్రార్‌ సైతం వెంకటేశ్‌ను ఇబ్బందులు పెడతాడేమో చూడాలి. ఈ నేపథ్యంలో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ తన ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకుంటాడా.. లేక గూగ్లీలకు బోల్తా కొడతాడా.. అనేది ఆసక్తి పెంచుతోంది.

రవి బిష్ణోయ్‌ ఎందుకంటే..

పంజాబ్‌ జట్టు బౌలర్లలో రవిబిష్ణోయ్‌ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. దానికి తోడు అవసరమైన వేళ వికెట్లు పడగొడుతున్నాడు. ఇప్పటివరకు అతడు 6.16 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగల ఈ యువ స్పిన్నర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు మహ్మద్‌ షమి, అర్ష్‌దీప్‌ లాంటి బౌలర్లు వికెట్లు తీస్తున్నా చివర్లో కాస్త ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నారు. దీంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాలంటే ఆ జట్టులో బిష్ణోయ్‌ ప్రధాన బౌలర్‌గా కనిపిస్తున్నాడు.

ఎవరెలా ఆడుతున్నారు..

రెండో దశలో రెండు జట్లూ పూర్తి భిన్నంగా ఆడుతున్నాయి. కోల్‌కతా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో కొనసాగుతుండగా .. పంజాబ్‌ ఒక విజయం, మూడు ఓటములతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయావకాశలు మోర్గాన్‌ జట్టుకే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ తేలిపోతున్నారు. మరోవైపు తొలి దశలో ఇలాగే సతమతమైన కోల్‌కతాలో ఇప్పుడు టాప్‌ ఆర్డర్‌ రాణిస్తుండటంతో పాటు స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి జట్టు విజయాల్లో కీలకంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని