Rahul Dravid: రిషభ్‌ పంత్‌తో మాట్లాడతాం: రాహుల్‌ ద్రవిడ్

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ విఫలమవ్వడంపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ స్పందించాడు...

Published : 07 Jan 2022 10:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ విఫలమవ్వడంపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ స్పందించాడు. షాట్ల ఎంపిక గురించి అతడితో కలిసి చర్చిస్తామని చెప్పాడు. గురువారం టీమ్‌ఇండియా రెండో టెస్టులో ఓటమిపాలయ్యాక ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పంత్‌ బ్యాటింగ్‌ తీరుపై నోరువిప్పాడు.

‘రిషభ్‌ పంత్ సానుకూలంగా ఉండే ఆటగాడని మనందరికీ తెలిసిందే. అతడు ఆడే వైవిధ్యమైన తీరుతోనే విజయవంతమయ్యాడు. అయితే, కొన్నిసార్లు షాట్ల ఎంపికలో ఇబ్బందిపడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ విషయంపై అతడితో కలిసి చర్చిస్తాం. ఈ మ్యాచ్‌లో షాట్‌ సెలెక్షన్‌ టైమింగ్‌ సరిగ్గా లేకపోవడంతోనే ఔటయ్యాడు. షాట్ల ఎంపిక అనేది కేవలం టైమింగ్‌కు సంబంధించిందే’ అని ద్రవిడ్‌ వివరించాడు.

‘ఎవరైనా ఆటగాడు క్రీజులోకి రాగానే కాస్త సమయం తీసుకొని పరిస్థితులను అర్థం చేసుకొని ఆడాలనుకోవడం మంచి పరిణామం. పంత్‌ విషయంలో ఏం జరుగుతుందో మేం అర్థం చేసుకున్నాం. అతడో పాజిటివ్‌ ప్లేయర్‌. తన ఆటతో మ్యాచ్‌ ఫలితాన్నే మర్చగల సమర్థుడు. అలాంటి ఆటగాడిని తన ఆట  తీరు మార్చుకోవాలని మేం చెప్పలేం. సందర్భాన్ని బట్టి షాట్ల ఎంపిక ఉండాలనేది మాత్రమే సూచిస్తాం. ఎప్పుడు ఎలా అటాక్‌ చేయాలనేది వివరిస్తాం. అతడు ప్రస్తుతం నేర్చుకునే దశలో ఉన్నాడు. కచ్చితంగా నేర్చుకుంటాడు’  అని హెడ్‌కోచ్‌ తన ఆలోచనలు పంచుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని