Pujara - Rahane: వాళ్లిద్దరూ జట్టులోఉండాలంటే ఇదే చివరి అవకాశం: గావస్కర్‌

ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె.. ఇక టెస్టు క్రికెట్‌లో కొనసాగాలంటే చివరగా ఒక్క...

Updated : 04 Jan 2022 12:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె ఇక టెస్టు క్రికెట్‌లో కొనసాగాలంటే చివరగా ఒక్క అవకాశమే మిగిలి ఉందని మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. జోహానెస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మరోసారి విఫలమైన సంగతి తెలిసిందే. ఒలివీర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 24వ ఓవర్‌లో పుజారా (3), రహానె (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. దీంతో వీరిద్దరిపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వారిద్దరు ఔటైనప్పుడు కామెంట్రీ చేస్తున్న గావస్కర్‌ స్పందించారు. ‘పుజారా, రహానె వరుస బంతుల్లో విఫలమవ్వడం చూస్తే.. సగటు వ్యక్తి ఎవరైనా.. వాళ్లు టెస్టుల్లో కొనసాగడానికి ఇక ఒక్క అవకాశమే మిగిలి ఉందని అనుకుంటారు. జట్టులో వారి స్థానాలపై ఇప్పటికే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమవ్వడం విచారకరం. ఇకపై వాళ్లు టీమ్ఇండియాలో కొనసాగాలంటే రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడటం ఒక్కటే వారు చేయాల్సింది’ అని గావస్కర్‌ అన్నారు. కాగా, పుజారా శతకం చేసి మూడేళ్లు కాగా.. రహానె గతేడాది మెల్‌బోర్న్‌ టెస్టులో సెంచరీ చేశాడు. అప్పటి నుంచి మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. దీంతో వీరిద్దరి స్థానాలపై ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి రావాలని చూస్తున్నాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానె తప్పక రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా విఫలమైతే ఇక మూడో టెస్టులో వీరిద్దరు ఆడటం కష్టమనే చెప్పొచ్చు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని