T20 World Cup: ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సులు.. వీడియో పంచుకున్న ఐసీసీ

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ త్రుటిలో ఓటమి నుంచి తప్పుకుంది. పాక్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో అసిఫ్‌ అలీ (25*; 7 బంతుల్లో) నాలుగు సిక్సులు బాది...

Published : 30 Oct 2021 14:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. పాక్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో అసిఫ్‌ అలీ (25*; 7 బంతుల్లో) నాలుగు సిక్సులు బాది జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌.. 147/6 తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయితే, బౌలింగ్‌లో కాస్త ఇబ్బందులు పడినా కీలక సమయాల్లో వికెట్లు తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో చివరి రెండు ఓవర్లలో పాక్‌ 24 పరుగులు చేయాల్సిన స్థితిలో అఫ్గాన్‌ సంచలన విజయం సాధించేలా కనిపించింది.

పాక్‌ ఛేదనలో అఫ్గాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఆదిలోనే ముజీబ్‌.. రిజ్వాన్‌ (8)ను ఔట్‌ చేయడంతో పాక్‌ ఆత్మరక్షణలో పడింది. బాబర్‌ (51; 47 బంతుల్లో 4x4), ఫకార్‌ జమాన్‌ (30; 25 బంతుల్లో 2×4, 1×6) నెమ్మదిగా ఆడారు. దీంతో పాక్‌ 8 ఓవర్లకు 49/1తో నిలిచింది. అయితే 11వ ఓవర్లో బంతి అందుకున్న రషీద్‌ పాక్‌ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. అతడు హఫీజ్‌ (10), బాబర్‌లను ఔట్‌ చేయగా.. జమాన్‌ను నబీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అఫ్గాన్‌ పోటీలోకి వచ్చింది. ఇక నవీన్‌ ఉల్‌హక్‌ వేసిన 18వ ఓవర్లో పాక్‌ కేవలం 2 పరుగులే తీసి మాలిక్‌ (19) వికెట్‌ పోగొట్టుకుంది. దీంతో మ్యాచ్‌ పాక్‌ చేజారుతున్నట్లే కనిపించింది. ఈ క్రమంలోనే చివరి 2 ఓవర్లలో 24 పరుగుల సమీకరణం పాకిస్థాన్‌కు కష్టంగా మారింది. అయితే, అప్పటికే అఫ్గాన్‌ ఉత్తమ బౌలర్లు రషీద్‌, ముజీబ్‌ల కోటా పూర్తి కావడంతో ప్రత్యామ్నాయం లేక 19వ ఓవర్‌ కరీమ్‌కు ఇచ్చింది. అతడు పేలవంగా బంతులేయగా అసిఫ్‌.. 1, 3, 5, 6 బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ వీడియోను ఐసీసీ అభిమానులతో పంచుకుంది. మీరూ ఆ వీడియో చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని