Cricket News: బుడగ దాటారు.. వేటు పడింది

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టులోని ముగ్గురు ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిషేధం విధించింది. శనివారం రాత్రి ఇంగ్లాండ్‌తో ఆడిన మూడో టీ20లో లంక జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే...

Published : 29 Jun 2021 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టులోని ముగ్గురు ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిషేధం విధించింది. శనివారం రాత్రి ఇంగ్లాండ్‌తో ఆడిన మూడో టీ20లో లంక జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అయ్యాక ముగ్గురు ఆటగాళ్లు బయోబబుల్‌ దాటి స్థానిక వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు తెలియడంతో వారిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు లంక బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వారిని వన్డే సిరీస్‌ ఆడేందుకు నిషేధిస్తూ వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. నిషేధం విధించిన వారిలో సీనియర్‌ ఆటగాడు కుశాల్‌ మెండిస్‌, వికెట్‌ కీపర్‌ నిరోషన్‌ డిక్‌విల్లా, ఓపెనర్‌ దనుష్క గుణతిలక ఉన్నారు. కాగా, ఈ ముగ్గురు ఆరోజు మ్యాచ్‌లో ఆడటం గమనార్హం.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని జట్లు ఇప్పుడు క్రికెట్‌ ఆడటం చాలా కష్టమైంది. ఆటగాళ్ల భద్రత కోసం ఆయా బోర్డులు కొవిడ్-19 నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తుండటంతో టోర్నీల నిర్వహణ చాలా కష్టంగా మారింది. సిరీస్‌ ప్రారంభానికి కనీసం మూడు వారాల ముందే ఆటగాళ్లందరినీ బయోబుడగలోకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఏ ఆటగాడు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టంగా టోర్నీలు నిర్వహిస్తున్నారు. అయినా అప్పుడప్పుడూ పలువురు క్రికెటర్లు నిబంధనలను గాలికొదిలేసి ఇలా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో వైరస్‌ బారిన పడుతున్నారు. అంతకుముందు పలువురు పాక్‌ క్రికెటర్లు కూడా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్ సందర్భంగా ఇలాగే బయోబుడగ దాటి నిబంధనలు అతిక్రమించిన సంగతి తెలిసిందే.

మరోవైపు శ్రీలంక ఈ మూడు టీ20ల సిరీస్‌లో పూర్తిగా చేతులేత్తేసింది. దాంతో ఇంగ్లాండ్‌ 3-0 తేడాతో ఘనంగా సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇది లంక జట్టుకు వరుసగా ఐదో టీ20 సిరీస్‌ ఓటమి కావడం గుర్తించాల్సిన విషయం. మరికొద్ది నెలల్లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు ఇలా విఫలమవుతుండటంపై పలువురు మాజీలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, వెంటనే తగు చర్యలు తీసుకొని జట్టును కాపాడాలని మాజీ కెప్టెన్‌ సన్‌త్‌ జయసూర్య ఆదివారం ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా ఈరోజే శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. అక్కడా జట్టుతో వచ్చేనెల 13 నుంచి మూడు టీ20లు, ఆపై మూడు వన్డేలు ఆడనుంది. మరి గబ్బర్‌ టీమ్‌తో తలపడేటప్పుడైనా శ్రీలంక పోటీనిస్తుందో లేదో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని