PAK X AFG: మ్యాచ్‌ తర్వాత కూడా పాక్‌కు షాకిచ్చిన అఫ్గానిస్థాన్‌!

మ్యాచ్‌ ఓడిపోయిన దాని కంటే.. ప్రెజెంటేషన్‌ సమయంలో ఓ అఫ్గాన్‌ (Afghanistan) క్రీడాకారుడు చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌ను మరింత సిగ్గుపడేట్లు చేశాయి. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే..

Updated : 24 Oct 2023 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ (Pakistan)పై అఫ్గానిస్థాన్‌ (Afghanistan) సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. కానీ, పాక్‌ను ఈ విజయం కంటే మరింత ఎక్కువ సిగ్గుపడేట్లు చేసే ఘటన మ్యాచ్‌ అనంతరం చోటు చేసుకొంది. అఫానిస్థాన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (87 పరుగులు) జట్టు విజయానికి బలమైన పునాదులు వేశాడు. దీంతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘నేను ఈ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను పాక్‌ నుంచి బలవంతంగా వెళ్లగొట్టిన నా అఫ్గానిస్థాన్‌ ప్రజలకు అంకితం చేస్తున్నాను’’ అని అన్నాడు. దీంతో ఆ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నేను పాజిటివ్ మైండ్‌తోనే బ్యాటింగ్‌కు దిగాను. గుర్బాజ్‌తో నాకు మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో బాగా ఉపయోగపడుతుంది. మేము అండర్‌-16 నుంచి కలిసి ఆడాం. మైదానంలో గుర్బాజ్‌ నాకు అండగా ఉన్నాడు. మ్యాచ్‌ను మా వైపు తిప్పుకోవడానికి ఇది చాలా ఉపయోగపడింది. ఈ విజయంతో నేను, నా దేశం గొప్పగా ఫీలవుతున్నాం

- జద్రాన్‌ 

వాస్తవానికి తాలిబన్లు, యుద్ధాల కారణంగా కొన్నేళ్ల క్రితమే లక్షల మంది అఫ్గాన్‌ వాసులు తలదాచుకోవడానికి పాకిస్థాన్‌కు వచ్చారు. అమెరికా అఫ్గాన్‌ నుంచి వెళ్లిన తర్వాత తాలిబన్ల పాలన రావడంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పాక్‌లో ఆశ్రయం పొందిన వారు ఇక్కడే శరణార్థి శిబిరాల్లో, చిన్నా చితకా పనులు చేసుకొంటూ పొట్టపోసుకుంటున్నారు. ఇలా జీవిస్తున్నవారి సంఖ్య 17 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఈ నెల మొదట్లో పాక్‌ ప్రభుత్వం వీరందరిని హఠాత్తుగా ఖాళీ చేయమని ఆదేశించింది.

ఛాంపియన్‌కు ఏమైంది?.. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ ఎందుకిలా?

నవంబర్‌ 1లోపు దేశాన్ని వీడాలని పాక్‌ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో గతిలేక అఫ్గాన్‌ వాసులు పాక్‌ను వీడుతున్నారు. అక్టోబర్‌ 21న కూడా 3,248 అఫ్గాన్‌ జాతీయులు దేశాన్ని వీడినట్లు పాక్‌ రేడియో వెల్లడించింది. ఇప్పటి వరకు 51 వేల మందిని దేశం నుంచి పంపించి వేసినట్లు పాక్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలపై అఫ్గాన్‌ వాసుల్లో అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం నెలకొని ఉంది. తాజాగా జద్రాన్‌ ప్రకటనతో అఫ్గన్‌ శరణార్థులకు సంఘీభావం తెలిపినట్లైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని