ఇంకో రెండు, మూడేళ్లు నెట్టుకొస్తా: ఉమేశ్‌ 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తుది జట్టులో చోటు సంపాదించుకొని మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేయాలని ఉందని టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...

Published : 04 Apr 2021 01:59 IST

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించాలి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ తుది జట్టులో చోటు సంపాదించుకొని మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేయాలని ఉందని టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే టీమ్‌ఇండియాలో ఇంకో రెండు, మూడేళ్లు నెట్టుకొస్తానని అన్నాడు. ఆపై యువకులు జట్టులోకి వస్తారని చెప్పాడు.

‘నాకిప్పుడు 33 ఏళ్లు. ఇంకో రెండు, మూడేళ్లు మాత్రమే టీమ్‌ఇండియాలో కొనసాగుతా. ఆ తర్వాత యువకులు నా స్థానాన్ని భర్తీ చేస్తారు. ఇది సరైనదేనని భావిస్తా. ఎందుకంటే జట్టుకు ఉపయోగకరం. నాలుగైదు టెస్టు మ్యాచ్‌లున్న పర్యటనల్లో ఐదారుగురు పేసర్లు ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. ప్రతీ ఒక్కర్నీ రెండేసి మ్యాచ్‌లు ఆడించొచ్చు. అలా చేస్తే ఆటగాళ్లకు పనిభారం కూడా తగ్గుతుంది. ఇలా చేయడం దీర్ఘకాలంలో ఉపయుక్తంగా ఉంటుంది’ అని ఉమేశ్‌ చెప్పుకొచ్చాడు.

‘అలాగే నేను విదేశీ పర్యటనల్లో ఎక్కువగా ఆడలేదు. అలాంటి వికెట్లపై సరైన అనుభవం కూడా లేదు. కానీ, ఇప్పటివరకు తగినంత స్థాయిలో టెస్టు క్రికెట్‌ ఆడాననే అనుకుంటున్నా. దాంతో నాకు కావాలినంత అనుభవంతో పాటు పిచ్‌లు ఎలా స్పందిస్తాయనేది పూర్తిగా అర్థమైంది. ఇక భవిష్యత్‌ గురించి ఆలోచిస్తే నాకైతే పెద్ద గాయాలేవీ లేవు. ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా ఇది నన్ను సంతోషపెడుతుంది. ఎందుకంటే ఒక పేసర్‌ గాయాలబారిన పడటం మొదలైతే అది కెరీర్‌ మొత్తం కొనసాగుతుంది. దాంతో ఆటగాడిగా కొనసాగే కాలం తగ్గిపోతుంది. ఆటగాళ్లకు గాయాలయ్యాక కోలుకోవడానికి తగిన సమయం పడుతుంది. దాంతో పునరావాస కేంద్రాల్లో గడపాల్సి వస్తుంది. నేను మాత్రం ఇలా ఎక్కువ సమయం గడపలేదు. చాలా తక్కువ గాయాలే అయినందున తగినంత క్రికెట్‌ ఆడాను’ అని వివరించాడు.

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్‌ తర్వాత ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. అయితే, అక్కడా తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దాదాపు దూరమైన అతడు ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడాలని ఉందన్నాడు. అందుకోసం బాగా కష్టపడుతున్నట్లు వివరించాడు. ‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఉండాలని మేమెంతో కష్టపడ్డాం. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్‌ ఆటగాడిని కాని నేను దీన్నే ప్రపంచకప్‌గా భావిస్తా. ఆ మ్యాచ్‌లో నేను మంచి ప్రదర్శన చేసి జట్టు విజయం సాధిస్తే అదెప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బంతి సీమ్‌, స్వింగ్‌ చాలా ముఖ్యమైన అంశాలు. దాంతో నేను కచ్చితంగా తుది జట్టులో ఉంటానని నమ్ముతున్నా’ అని ఉమేశ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని