Rohit-Virat: రోహిత్‌, విరాట్‌.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్‌

కొన్నేళ్లుగా భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలోనూ సేవలందించిన స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ టీ20 భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 04 Feb 2023 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల టీ20 భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. కొన్నేళ్లుగా వారిద్దరూ భారత జట్టుకు గొప్పగా సేవలందించారని తెలిపాడు. అయితే వారి వయసు, ఫామ్‌ని బట్టి భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్‌ ఆడతారా అనేది ప్రశ్నగా మారిందన్నాడు.

‘‘ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ల్లో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఏడాది చివర్లోనే వన్డే ప్రపంచకప్‌ కూడా ఉంది. ప్రపంచకప్‌ వరకు రోహిత్‌, విరాట్‌ ఒత్తిడి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు వారికి విశ్రాంతి ఇచ్చి ఉండొచ్చు. అయితే భవిష్యత్తును ఒకసారి పరిశీలిస్తే మాత్రం టీ20ల్లో కేవలం యువకులే ఉంటారు. తర్వాతి టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ ఆడతాడని నేను అనుకోవట్లేదు. విరాట్‌కి కూడా అవకాశాలు తక్కువే. కానీ రోహిత్‌ మాత్రం కచ్చితంగా ఆడడు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 36. అందువల్ల వచ్చే టీ20 ప్రపంచకప్‌ వరకు అతడు ఎంత ఫిట్‌గా ఉంటాడో ఎలాంటి ఫామ్‌ని కొనసాగిస్తాడో చూడాలి’’ అని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరి 9న భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్, రోహిత్‌ ఈ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని