Virat Kohli: విరాట్‌ ఒక్క ఇన్‌స్టా పోస్టుకు ఎంత వసూలు చేస్తాడంటే..?

భారత్‌లో అత్యంత ఖరీదైన ఇన్‌స్టా పోస్టులు విరాట్‌ కోహ్లీవే(Virat Kohli). అతడు సింగిల్‌ స్పాన్సర్డ్‌ పోస్టుకు చేసే మొత్తం కొందరు క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు ఆదాయం కంటే ఎక్కువ. 

Updated : 11 Aug 2023 15:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా రన్‌ మెషీన్‌ విరాట్‌ (Virat Kohli) రికార్డుల్లోనే కాదు.. సంపాదనలో  కూడా అందరికంటే ముందున్నాడు. సామాజిక మాధ్యమాల్లోని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌లో కూడా దేశంలో విరాట్‌ (Virat Kohli) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు ఒక్క పోస్టుకు వసూలు చేసే మొత్తం కొందరు క్రికెటర్ల వార్షికాదాయం కంటే ఎక్కువ. ఇటీవల విడుదలైన హూపర్‌ హెచ్‌క్యూ జాబితా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. 

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక మొత్తం ఛార్జి చేసే తొలి 20 మంది పేర్లను విడుదల చేసింది. వీరిలో విరాట్‌ (Virat Kohli) 14 స్థానంలో ఉన్నాడు. కోహ్లీ (Virat Kohli) సింగిల్‌ స్పాన్సర్డ్‌ పోస్టుకు రూ.11 కోట్లు తీసుకుంటాడు. అతడికి 25.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఈ 20మంది జాబితాలో భారత్‌ నుంచి అతడొక్కడే స్థానం దక్కించుకోవడం విశేషం. ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో  29వ స్థానం దక్కించుకొంది. ఆమె ఒక పోస్టుకు రూ. 4.4 కోట్లు వసూలు చేస్తోంది.

ఈ జాబితాపై హూపర్‌ హెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు మైక్‌ బాండర్‌ స్పందిస్తూ.. సూపర్‌ స్టార్లు ఇన్‌స్టా నుంచి ఆర్జిస్తున్న సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. వీరి సంపాదన ఏళ్లు గడిచేకొద్దీ పెరుగుతోందని వెల్లడించారు. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌పై వీరి సంపాదన ఏటా పెరుగుతూనే ఉండటం చూసి నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. కొత్త తరం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వచ్చినా.. సంప్రదాయ సెలబ్రెటీల ఆకర్షణ, గ్లామర్‌ ఏమాత్రం తగ్గనట్లే కనిపిస్తోంది. రొనాల్డో, మెస్సీ మైదానంలోనే కాదు.. డిజిటల్‌ వేదికలపైనా రాజ్యమేలుతున్నారు. సామాన్యూడిపై వారి బలమైన ప్రభావాన్ని ఇది తెలియజేస్తోంది’’ అని అన్నారు.

తిలక్‌కు కలిసి రావొచ్చు.. ఫిట్‌నెస్‌ కీలకం.. నాలుగులో సూర్య!

హూపర్‌ హెచ్‌క్యూ జాబితాలో ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో మెస్సీ ఉన్నాడు. 59.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న రొనాల్డో ఒక పోస్టుకు రూ.26.7 కోట్లు తీసుకొంటున్నాడు. 47.9 కోట్ల మంది ఫాలోవర్లతో ద్వితీయ స్థానంలో ఉన్న మెస్సీ రూ.21 కోట్లు వసూలు చేస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని