Asian Games: భారత్-ఇరాన్‌ కబడ్డీ ఫైనల్‌.. గంటపాటు ‘సస్పెండ్‌’ హైడ్రామాకు కారణమిదే!

ఆసియా క్రీడల్లో (Asian Games) కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. అదే క్రమంలో దాదాపు గంటపాటు ఆటను నిలిపివేయాల్సిన పరిస్థితి. పాయింట్ల వద్ద భారత్ - ఇరాన్‌ జట్ల ఆటగాళ్లు పట్టుబట్టడంతో తప్పలేదు. చివరికి భారత్‌ను విజేతగా ప్రకటించి గోల్డ్‌ మెడల్‌ను అందించారు.

Published : 07 Oct 2023 18:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాలు సెంచరీ దాటిపోయాయి. అందులో పురుషుల కబడ్డీ విభాగంలో స్వర్ణం పతకం కూడా ఉంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 33-29 తేడాతో (IND vs IRN) విజయం సాధించి గోల్డ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇరు జట్ల మధ్య మరొక నిమిషంలో మ్యాచ్‌ ముగుస్తుందనగా.. తీవ్రమైన హైడ్రామా చోటు చేసుకుంది. పాయింట్ల వద్ధ ఆటగాళ్లు పట్టుపట్టడంతో ఆటను దాదాపు గంటపాటు సస్పెండ్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరికి సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత భారత్‌ను విజేతగా ప్రకటించారు. 

వివాదం ప్రారంభం ఇలా..

భారత్ - ఇరాన్‌ ఆటగాళ్లు తొలి నుంచి పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. మ్యాచ్‌ ముగియడానికి మరొక 65 సెకన్ల సమయం మాత్రమే ఉందనగా.. భారత్‌ నుంచి కెప్టెన్ పవన్ రైడ్‌కు వెళ్లాడు. ఇది డూ ఆర్‌ డై పరిస్థితి. అయితే, పవన్‌ మాత్రం ప్రత్యర్థి ఆటగాళ్లను టచ్‌ చేయకుండా లాబీ మీదకు వెళ్లిపోయాడు. అతడిని ఆపేందుకు ఇరాన్‌కు చెందిన నలుగురు డిఫెండర్లూ వెళ్లిపోయారు. దీంతో లాబీ మీదకు ఇరాన్‌ ఆటగాళ్లు వచ్చినందుకు తమకు పాయింట్లు ఇవ్వాలని భారత్.. ఎవరినీ టచ్‌ చేయకుండా పవనే లాబీపైకి వెళ్లినందుకు అతడిని ఔట్‌గా ప్రకటించాలని ఇరాన్‌ పట్టుబట్టింది. ఇక్కడే అధికారులకు సంకట స్థితి ఎదురైంది. భారత్ ఆటగాళ్లు పాత రూల్స్‌ ప్రకారమే పాయింట్లు కేటాయించాలని డిమాండ్‌ చేయగా.. ఇరాన్‌ మాత్రం కొత్త  రూల్స్‌ ప్రకారం తమకు పాయింట్ ఇవ్వాలని పేర్కొంది. ఇరు జట్ల సిబ్బంది వాదోపవాదాలు చేసుకుంటూ ఉండగా.. ఆటగాళ్లూ మైదానంలోని మ్యాట్‌పైనే కూర్చొండిపోయారు. 

రూల్స్‌ ఏం చెబుతున్నాయ్‌?

అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ రూల్‌బుక్‌ (IKF) ప్రకారం.. డిఫెండర్‌ లేదా డిఫెండర్లు ఎవరూ కూడా లాబీ మీదకు రైడర్‌ను తాకకుండా వెళ్లకూడదు. వెళ్తే ప్రత్యర్థికి పాయింట్లు వస్తాయి. అలాగే లాబీ మీద రైడర్‌ను పట్టుకున్నాసరే అతడిని నాటౌట్‌గా పరిగణిస్తారు. ఒకవేళ రైడర్‌ డిఫెండర్లలో ఎవరినీ టచ్‌ చేయకుండా ఆ లాబీ మీదకు వెళ్తే సెల్ఫ్‌ఔట్‌ అవుతాడు. అప్పుడు ప్రత్యర్థికి పాయింట్‌ వస్తుంది. 

అయితే, ఇలాంటి రూల్‌ డిఫెండింగ్‌ జట్టు విషయంలో సరిగా లేదని భావించిన ప్రో కబడ్డీ లీగ్‌ (PKL) నిర్వాహకులు .. ఆ రూల్‌ను మార్చుకున్నారు. రైడర్‌ ఎవరైనా సరే అలా లాబీ మీదకు వెళ్తే అక్కడితో అతడిని ఎలిమినేట్‌ చేసేస్తారు. డిఫెండింగ్‌ జట్టుకు ఒక పాయింట్‌ ఇవ్వడం జరుగుతుంది. 

భారత్‌ - ఇరాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రైడింగ్‌పై సమీక్షలు చేసినప్పటికీ, ఏ రూల్‌ ప్రకారం పాయింట్లను కేటాయించాలనే దానిపై సందిగ్ధత ఏర్పడింది. పాత రూల్‌ ప్రకారం భారత్‌కు నాలుగైదు పాయింట్లు (డిఫెండర్లను బట్టి) వస్తాయి. కొత్త నిబంధన ప్రకారమైతే ఇరాన్ ఖాతాలో ఒక పాయింట్‌ చేరుతుంది. కానీ, మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్లకూ చెరొక పాయింట్‌ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇరాన్‌ ఆటగాడు కూడా సెల్ఫ్‌ ఔట్‌ అయినట్లుగా పేర్కొన్నాడు.  అప్పుడు ఇరు జట్లూ 29-29కి చేరాయి. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త రూల్‌ను అంతర్జాతీయ టోర్నీల్లో అమలు చేయలేదనే విషయాన్ని టీమ్‌ఇండియా నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రో కబడ్డీ సీజన్‌ 9లోనే ఈ రూల్‌ను ఉపయోగించారని పేర్కొ్ంది. అంతర్జాతీయ, ఆసియా కబడ్డీ ఫెడరేషన్లు అంగీకరిస్తేనే నిబంధనలను ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. చివరికి పాత రూల్‌ ప్రకారం భారత్‌కు నాలుగు పాయింట్లు కేటాయిస్తున్నట్లు నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. దీంతో భారత్ 33-29 తేడాతో ఫైనల్‌లో విజయం సాధించి స్వర్ణం దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని