- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Sports News: 2 భారత జట్లు.. ఘోర ఓటములు
ఒకేసారి కామన్వెల్త్, పాక్ సిరీసుకు రెండు జట్లు పంపిన బీసీసీఐ
ఒకేసారి రెండు దేశాల్లో పర్యటిస్తున్న జట్టుగా భారత్ చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో ఆస్ట్రేలియాకూ సాధ్యం కాలేదిది. అలాంటిది కరోనా ఆంక్షల నడుమ.. క్వారంటైన్ల బాధల మధ్య.. తప్పనిసరి పరిస్థితుల్లో బీసీసీఐ మాత్రం ముందడుగు వేస్తోంది. అనుభవజ్ఞులను ఇంగ్లాండ్‌కు.. యువకులను శ్రీలంకకూ పంపిస్తోంది. గతంలోనూ టీమ్‌ఇండియాకు ఇది అనుభవమే! కాకపోతే కాస్త చేదు!!
కామన్వెల్త్ × సహారా
1998, సెప్టెంబర్.. భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని నెల! సహారా కప్, కామన్వెల్త్ క్రికెట్ జరిగిన కాలమది. భారత ఒలింపిక్ క్రికెట్ కమిటీ, బీసీసీఐకి మధ్య కామన్వెల్త్ క్రికెట్ పోటీలు పెద్ద అగాథమే సృష్టించింది. ముందు నుంచీ సమాచారం ఇస్తున్నా.. సమయం దగ్గర పడుతున్నా కామన్వెల్త్‌కు జట్టును పంపించడంపై నిర్ణయం తీసుకోవడంలో బోర్డు తాత్సారం చేసింది. కెనడా వేదికగా పాకిస్థాన్‌తో ఐదు వన్డేల సిరీసుకే ప్రాధాన్యం ఇచ్చింది. సందిగ్ధం నెలకొన్న తరుణంలో ఆఖరికి దిగొచ్చింది. రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. బోర్డు వైఖరి, జట్లలో పస లేకపోవడంతో ‘మనీ లేదా మెడల్’ వివాదం చెలరేగింది.
దిక్కుతోచని కెప్టెన్సీ
కామన్వెల్త్ వేదిక కౌలాలంపూర్. సెప్టెంబర్ 9-19 మధ్య పోటీలు జరిగాయి. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఆడాయి. ఆస్ట్రేలియా, కెనడా, ఆంటిగ్వాతో కూడిన గ్రూప్-బిలో భారత్ ఉంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజయ్ జడేజాను సారథిగా ఎంపిక చేశారు. అనిల్ కుంబ్లే వైస్ కెప్టెన్. హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ తెందూల్కర్ కీలక ఆటగాళ్లు. నిఖిల్ చోప్రా, రోహన్ గావస్కర్, గగన్ ఖోడా, అమే ఖురేసియా, పారస్ మాంబ్రే, దేబసిస్ మహంతి, ఎమ్మెస్కే ప్రసాద్, రాహుల్ సింఘ్వి, రాబిన్ సింగ్ మిగతా సభ్యులు.
ఆంటిగ్వా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా వాతావరణం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. ఫలితం తేలలేదు. కెనడాతో మ్యాచులో మొదట భారత్ 157/9 చేసింది. తర్వాత ప్రత్యర్థిని 45కు కుప్పకూల్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచులో ఆసీస్‌తో తలపడింది. మొదట కంగారూలు 255/5 స్కోరు చేసింది. స్టీవ్ వా (100*), టామ్ మూడీ (78*) అజేయంగా నిలిచారు. ఛేదనలో టీమ్‌ఇండియా తేలిపోయింది. బ్రాడ్ యంగ్ (4/23) దెబ్బకు 37.2 ఓవర్లకు 109కే కుప్పకూలింది. అజయ్ జడేజా (27) టాప్ స్కోరర్. ఏం చేయాలో? ఎలా ఆడాలో? ఎలాంటి వ్యూహాలు రచించాలో? అటు కోచ్‌లకు, ఇటు ఆటగాళ్లకూ తెలియకపోవడం గమనార్హం. దాంతో గ్రూప్ దశతోనే కథ ముగిసింది.
గందరగోళం..
టొరంటో వేదికగా సెప్టెంబర్ 11 నుంచి 19 వరకు సహారా కప్ జరిగింది. ఐదు వన్డేల సిరీసిది. మహ్మద్ అజహరుద్దీన్ సారథి. గంగూలీ అతడి డిప్యూటీ. నవజ్యోత్ సింగ్ సిద్దూ, రాహుల్ ద్రవిడ్, హృషికేశ్ కనిత్కర్, నయన్ మోంగియా, అజిత్ అగార్కర్, సునిల్ జోషి, సాయిరాజ్ బహుతులే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, సంజయ్ రౌల్, జేవీ పరాంజపె, జ్యోతి యాదవ్ జట్టు సభ్యులు. నిజానికి ఈ సిరీస్ జరిగిన తీరు బాధాకరం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల మధ్య సఖ్యత లేదు! ఆటగాళ్లలో బృందతత్వం లేదు. జట్టులో చోటుంటుందో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే కామన్వెల్త్ క్రీడలు కాగానే నలుగురు ఆటగాళ్లు టొరంటో వస్తారని బీసీసీఐ మొదట చెప్పింది. ఆ తర్వాత గందరగోళం చెలరేగింది.
వరుసగా 4 మ్యాచుల్లో పరాభవం
ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-4 తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. తొలి వన్డేలో సౌరవ్ గంగూలీ బంతి, బ్యాటుతో చెలరేగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఛేదనలో అర్ధశతకం (54) చేయడమే కాకుండా బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు. మరో 38 బంతులుండగానే భారత్ గెలవడం గమనార్హం. రెండో వన్డేలో పాక్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక అజ్జూ సేన 51 తేడాతో ఓటమి పాలైంది. మూడో మ్యాచులో 256 ఛేదించలేదు. 180కే కుప్పకూలింది. నాలుగో వన్డేలో ఓటమి మరింత ఘోరం. షాహిద్ అఫ్రిది (109), ఇంజమామ్ (78) రాణించడంతో దాయాది 316/6 పరుగులు చేసింది. సిద్ధూ (62), అజహరుద్దీన్ (40) మినహా మరెవ్వరూ ఆడకపోవడంతో భారత్ 134 పరుగుల తేడాతో ఓడింది. ఐదో వన్డేలో సచిన్ (77), అజహరుద్దీన్ (101) చెలరేగడంతో భారత్ 256/9 చేసింది. కానీ పాక్ 48.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఛేదించేసింది. సయీద్ అన్వర్ (83), ఆమిర్ సొహైల్ (97*) విజయం అందించారు.
వస్తానంటే వద్దంటూ..
సహారా కప్‌లో 3 వన్డేలు ముగిశాక వివాదం మొదలైంది. కామన్వెల్త్‌లో ఆడిన నలుగురు సీనియర్లు టొరంటో వెళ్తారని సెప్టెంబర్ 15న బీసీసీఐ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ అన్నారు. ‘లేదు’ అని మరుసటి రోజు బోర్డు కార్యదర్శి జేవై లెలె మీడియాకు చెప్పారు. మళ్లీ 17న ‘ఇద్దరు వెళ్తారు. సచిన్, జడేజా’ అని వెల్లడించారు. వచ్చేది నలుగురో? ఇద్దరో? తెలీక జట్టు తికమక పడింది. స్వదేశానికి ఎవరిని పంపించాలో? ఎందరిని పంపించాలో? వారికి అర్థం కాలేదు. ఆటగాళ్లు అభద్రతా భావానికి లోనయ్యారు.
మరోవైపు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో లేని సచిన్ వస్తే ఆడబోమని పాక్ చెప్పింది. బీసీసీఐ చొరవతో నలుగురినీ అనుమతించేందుకు పీసీబీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్ అంగీకరించాడు. కొత్త కోచ్ జావెద్ మియాందాద్ ససేమిరా అన్నాడు. మొత్తానికి సచిన్, జడేజా రావడానికి అంగీకరించారు. నాలుగో వన్డేలోకు జడేజా ఆడినా సచిన్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడు కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి వెళ్లాడు. ఆ సమయంలో సన్నీ పాడిన ‘ఆతీ కా ఖండాలా’ పాట దుమారం రేపింది. ఏదేమైనా ఆఖరి వన్డేలో మాస్టర్ ఆడినా ఓటమి తప్పలేదు. మొత్తానికి రెండు జట్ల కథ అలా ముగిసింది.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Karnataka: సావర్కర్- టిప్పుసుల్తాన్ ఫ్లెక్సీల వివాదం.. శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్తత!
-
World News
Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
India News
Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!