Virat Kohli: చాలా కార్లు అమ్మేసిన విరాట్.. కారణం చెప్పేసిన స్టార్‌ బ్యాటర్

ఐపీఎల్‌లో (IPL 2023) ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఒక్కసారి కూడా కప్‌ను సొంతం చేసుకోకపోయినా ఇప్పటికీ ఆ జట్టంటే క్రేజ్‌ ఎక్కువే.  కారణం విరాట్ కోహ్లీ (Virat Kohli). 15 సీజన్లలోనూ ఆర్‌సీబీ తరఫున ఆడిన ఏకైక ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. నిజజీవితంలోని కొన్ని ఆసక్తికర సన్నివేశాలను పంచుకున్నాడు.

Published : 30 Mar 2023 11:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 16వ (IPL 2023) సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ కొత్త టాటూతో కనువిందు చేయనున్నాడు.  మరోవైపు తనకు కార్లంటే విపరీతమైన ఇష్టమని,  ఒకప్పుడు చాలా కార్లు తన గ్యారేజీలో ఉండేవని, అయితే వాటిలో కొన్నింటిని అమ్మేసినట్లు చెప్పాడు. ఇప్పుడు కేవలం అవసరమైన కార్లను మాత్రమే ఉంచుకున్నానని, వాటిలోనే ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు. ఇదంతా ఆర్‌సీబీ ఫొటో షూట్‌  సందర్భంగా చిట్‌చాట్‌లో వెల్లడించాడు. బోల్డ్‌ డైరీస్‌ పేరిట ఆర్‌సీబీ ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేసింది. 

వ్యాఖ్యాత: అప్పటికప్పుడు అనుకొని కొనుగోలు చేసి.. ఉపయోగించని వస్తువులు ఏవైనా ఉన్నాయా..? 

విరాట్: హఠాత్తుగా చూడగానే కొనుగోలు చేసిన వాటిల్లో ఎక్కువగా కార్లు ఉండేవి. చాలావరకు అప్పటికప్పుడు కొన్నవే. అయితే వాటిల్లో ప్రయాణించడం చాలా తక్కువ. ఒకానొక సమయంలో ఇది సరికాదని భావించి చాలా కార్లను అమ్మేశా. ఇప్పుడు మాకు అవసరం అనుకున్న వాటిని ఉంచుకుని.. అందులోనే ప్రయాణిస్తున్నాం. ఇదంతా మానసికంగా పరిణతి సాధించడం వల్లే సాధ్యమైంది. ప్రతి విషయంపైనా అవగాహన తెచ్చుకుని పరిణతితో ఆలోచిస్తున్నా. ప్రాక్టికల్‌గా మనకు ఏమి అవసరమో తెలుసుకోవాలి. 

వ్యాఖ్యాత: ఒకవేళ క్రిస్టియానో రొనాల్డొ, రోజర్‌ ఫెదరర్‌, నువ్వు ఒకే టేబుల్‌ వద్ద కూర్చుంటే.. మీ మధ్య సంభాషణ దేని గురించి ఉంటుంది..? 

విరాట్‌: నేను నిశ్శబ్దంగా కూర్చుని.. వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను. నిజం చెప్పాలంటే ఏం మాట్లాడతానో కూడా తెలియదు. క్రీడా ప్రపంచంలో దిగ్గజ అథ్లెట్లను కలవడం అద్భుతంగా ఉంటుంది. వారి మాటలను విన్నా సరిపోతుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు