Best Apps: ఏం సినిమా చూడాలో అర్థం కావట్లేదా?యాప్‌లున్నాయిగా..!

సినిమా చూసేంత సమయం ఉన్నా ఏది చూడాలో తెలియట్లేదా? ఈ యాప్‌లు మీకు సజస్ట్‌ చేస్తాయి. 

Published : 28 May 2022 22:13 IST

సినిమా చూడాలి... కానీ, ఏది బాగుంటుంది?ఎక్కడ చూడాలి? ఓటీటీలున్నాయ్.. అయినా ఎవరైనా మంచి మూవీ సజెస్ట్‌ చేస్తే బాగుండని ఆలోచించారా? ఈ ఆలోచనల్లోంచే ఇప్పుడు కొత్త కొత్త యాప్‌లు, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. సినిమా చూసేంత సమయం ఉన్నా ఏది చూడాలో తెలియట్లేదని అయోమయంలో పడినప్పుడు.. ఇవి మీకు మార్గనిర్దేశం చేస్తాయి. అయితే, వీటిల్లో ఎక్కువగా ఇంగ్లిషు సినిమాలే కనిపిస్తుండటం గమనార్హం.

ఆల్‌ ఇన్‌ వన్‌ పరిష్కారం

ఫ్రెండ్‌స్పైర్‌ (Friendspire) ఇదో ఆల్‌ ఇన్‌ వన్‌ యాప్‌. సినిమా, టీవీ షోలు, పాడ్‌క్యాస్టుల్లో.. ఏది చూడాలో తెలియని వేళ మీకో మంచి సలహా ఇస్తుంది. ఇందుకు మీరు తొలుత చేయాల్సిందల్లా యాప్‌ ఇన్‌స్టలేషన్‌. ముందుగా భాష, ఆసక్తి, అభిరుచులను ఎంచుకోవాలి. ఆపై IMDb, Rotten Tomatoes వంటి సినిమా రైటింగ్‌ సైట్లలో మీరు విశ్వసించే వాటిని సలెక్ట్‌ చేయాలి. అలాగే మీకు నచ్చిన 5-10 సినిమాలను ఎంచుకుంటే వాటికి అనుగుణంగా మూవీ సజెస్ట్‌ చేస్తుంది. మన స్నేహితుల్లో ఎవరైనా ఈ యాప్‌ వాడుతున్నట్లయితే వారి సిఫార్సులను అందించడానికి ఇందులో ఆప్షన్స్‌ ఉన్నాయి.


మరో స్ట్రీమింగ్ గైడ్‌

జస్ట్‌వాచ్ (JustWatch) యాప్‌ ఇది మరో స్ట్రీమింగ్ గైడ్. ఇతర స్ట్రీమింగ్ సేవల యాక్సెస్‌ మీకు ఉన్నట్లయితే.. వాటికి అనుగుణంగా కొత్త, పాత సినిమాలతో పాటు ట్రెడింగ్‌ మూవీలు ఏంటో సూచిస్తుంది. ఆసక్తికి అనుగుణంగా సినిమా సిఫార్సులను అందిస్తుంది. అచ్చంగా చెప్పాలంటే ఫ్రెండ్‌స్పైర్‌ యాప్‌లాగే పనిచేస్తుంది. 


టీవీ షోల ప్రత్యేకం..

వీటితో పాటే టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌లకు సంబంధించి టీవీ టైమ్ (TV Time) యాప్‌ అందుబాటులో ఉంది. ఇందులో మీరు చూడాలనుకుంటున్న సిరీస్‌లను యాప్‌లో తొలుత లిస్ట్‌ చూసుకోవాలి. ఆపై లిస్ట్‌ ఐటెమ్‌లోకి వెళ్లి ఒక్కో సిరీస్‌కు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లన్ని ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లో పూర్తి ఉచితంగా లభిస్తుండగా.. మరో స్ట్రీమింగ్‌ గైడ్‌ యాప్‌ మూబి (MUBI)కి చందా చెల్లించాల్సి ఉంటుంది. 


మేడిన్‌ ఇండియా

యాప్‌లే కాకుండా ‘Flixjini’ అనే మేడిన్‌ ఇండియా వెబ్‌సైట్‌ కూడా ఉత్తమ సినిమాలను సజెస్ట్‌ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏంటో ఇది తెలియజేస్తుంది. అభిరుచికి అనుగుణంగా కంటెంట్‌లను సూచిస్తుంది. వీటితో పాటే మూవీ రివ్యూలు, రేటింగ్‌లు, సినిమాల అవార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తుంది. యాప్‌ రూపంలోనూ ఈ వెబ్‌సైట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని