చిరుతోత్సాహం!

మొదట్లో దాని శాస్త్రీయ నామం ఫెలిస్‌ జుబాటస్‌. జర్మనీ పర్యావరణ వేత్త జోహాన్‌ క్రిస్టియన్‌ డేనియల్‌ వోన్‌ ష్రెబర్‌ 1777లో ఈ పేరు పెట్టారు. కొన్ని దశాబ్దాల తర్వాత 1828లో బ్రిటన్‌ శాస్త్రవేత్త జోషువా బ్రూక్స్‌ దానికి అసినోనీక్స్‌ అనే నామాన్ని ఖరారు చేశారు.

Published : 23 Mar 2022 01:02 IST

మొదట్లో దాని శాస్త్రీయ నామం ఫెలిస్‌ జుబాటస్‌. జర్మనీ పర్యావరణ వేత్త జోహాన్‌ క్రిస్టియన్‌ డేనియల్‌ వోన్‌ ష్రెబర్‌ 1777లో ఈ పేరు పెట్టారు. కొన్ని దశాబ్దాల తర్వాత 1828లో బ్రిటన్‌ శాస్త్రవేత్త జోషువా బ్రూక్స్‌ దానికి అసినోనీక్స్‌ అనే నామాన్ని ఖరారు చేశారు. అనంతరం 1917లో బ్రిటన్‌ జంతు శాస్త్రవేత్త రెజినాల్డ్‌ ఇన్స్‌ పోకాక్‌ దీన్ని అసినోనైచినే అనే ఉప కుటుంబ తరగతిలో చేర్చారు. ఇవన్నీ దేనికి సంబంధించిన సంగతులో తెలుసా? దాదాపు 70 ఏళ్ల క్రితం మనదేశం నుంచి కనుమరుగైన చిరుతపులి సంగతులు. ఇప్పుడెందుకు చెప్పుకోవడం? చిరుతపులిని మళ్లీ మనదేశంలోని అడవులకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు మరి. దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి వీటిని తేనున్నారు. ఇందుకోసం ఇటీవలే ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లింది. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఐదేళ్లలో 50 చిరుతపులులు మనదేశంలోకి అడుగుపెట్టనున్నాయి. సుమారు 12-14 చిరుతలను ముందుగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో ఉంచాలని, తర్వాత ఉపగ్రహ రేడియో కాలర్లను అమర్చి అడవుల్లో విడిచిపెట్టాలని భావిస్తున్నారు. తొలి దఫా చిరుతలు వచ్చే స్వాతంత్య్ర దినోత్సవంలోపు రావచ్చని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుతే. మనదేశంలోని చిట్టచివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో (ఒకప్పుడిది మధ్యప్రదేశ్‌లో ఉండేది) మరణించింది. చిరుతపులులు మనదేశంలో పూర్తిగా అంతర్థానమైనట్టు 1952లో ప్రకటించారు. కనుమరుగైన జంతువు తిరిగి కనిపిస్తే అంతకన్నా కావాల్సిందేముంది?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని