స్వయం ప్రయోగశాలలు

స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్‌ ఫిక్షన్‌ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి.

Updated : 24 Jan 2024 04:51 IST

స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్‌ ఫిక్షన్‌ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. మరి స్వయం ప్రయోగశాలల గురించి విన్నారా? ఇవి మనుషుల ప్రమేయం లేకుండా తమకు తామే ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. అదీ అత్యంత వేగంగా, నిర్విరామంగా.

 సైన్స్‌ ప్రయోగశాల అనగానే శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు ఒక చేత్తో గాజు బీకర్లు పట్టుకోవటం, వివిధ రసాయనాలను కలిపి పరీక్షించటం వంటి దృశ్యాలే గుర్తుకొస్తాయి. చేసిన ప్రయోగాన్నే మళ్లీ చేయటం, ఫలితాలను సునిశితంగా విశ్లేషించటం, వాటిని నమోదు చేయటం.. అంతా ఓ పెద్ద తతంగం. వీటికి సమయమూ ఎక్కువగానే పడుతుంది. ప్రయోగం చేసేవారికి మంచి నైపుణ్యమూ అవసరం. కానీ శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు చేసే పనులను రోబో చేతులే చేస్తుంటే? కొన్నాళ్ల క్రితం ఇది అసాధ్యమనే అనుకునేవారు. ఎందుకంటే చిన్న సైన్స్‌ ప్రయోగమైనా చాలా సంక్లిష్టంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు స్వయం ప్రయోగశాలల (అటానమస్‌ ల్యాబొరేటరీ) రూపంలో ఓ నిశ్శబ్ద విప్లవం వస్తోంది. దీనికి అధునాతన కృత్రిమ మేధ (ఏఐ) దన్నుగా నిలుస్తుండటం గమనార్హం.

ఫలితాలు త్వరగా

మెరుగైన బ్యాటరీల దగ్గరి నుంచి శక్తిమంతమైన మందుల వరకూ కొత్త పదార్థాలను కనుక్కోవటానికి శాస్త్రవేత్తలు నిరంతరం శోధిస్తూనే వస్తున్నారు. అయితే ఇది పెద్ద పని. ఈ విషయంలో ఇప్పుడు కృత్రిమ మేధ ఎంతగానో తోడ్పడుతోంది. వీటితో కొత్త ఆకృతులను అంచనా వేసే అవకాశాలు బాగా పెరిగిపోయాయి. ఉదాహరణకు గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్‌ సంస్థ రూపొందించిన ఆల్ఫాఫోల్డ్‌ అనే కృత్రిమ మేధనే తీసుకోండి. ఇది అమైనో ఆమ్లం క్రమం ఆధారంగా 3డీలో ప్రొటీన్ల ఆకృతిని అంచనా వేయగలదు. కాకపోతే ఇలాంటి ఆకృతులు ఉనికిలో ఉన్నాయా? లేవా? అవి నిజమేనా? అని పరీక్షించే సామర్థ్యం మనకింకా పట్టుబడలేదు. ఈ సమస్య చాలా రంగాల్లో చూస్తున్నదే. గత సంవత్సరం నవంబరులో గూగుల్‌ డీప్‌మైండ్‌ సంస్థ రూపొందించిన జీనోమ్‌ అనే ఏఐ నమూనా మెరుగైన సౌర ఫలకాలు, కంప్యూటర్‌ చిప్స్‌లో వాడుకోగదగిన లక్షలాది స్ఫటికాల ఆకారాలను అంచనా వేసింది. వీటిని ప్రయోగశాలలో రూపొందించటానికి చాలా సమయం పడుతుంది. సిబ్బంది కూడా ఎక్కువ కావాలి. ఇక్కడే అటనమస్‌ ప్రయోగశాలలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. తమకు తామే పనిచేసే ఇవి మన కన్నా కోట్లాది రెట్ల ఎక్కువ వేగంతో ప్రయోగాలు చేయగలవు. ఆయా పదార్థాల గుణాలను విశ్లేషించగలవు. ఫలితాలను అంచనా వేయగలవు. గుర్తించిన విషయాలను బట్టి భవిష్యత్‌ ప్రయోగాలకు మార్గం చూపగలవు. ఇవి మనలాగా నిద్రపోవు. నిర్విరామంగా పనిచేయటం వల్ల త్వరగానూ ఫలితాలు వెలువడతాయి.

వేగంగా వెలుస్తున్నాయి

వివిధ రంగాల్లో సైన్స్‌ ప్రయోగాలను నిర్వహించటానికి పరిశోధకులు అటనమస్‌ ల్యాబ్‌ల మీద ఆసక్తి చూపుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే ఆరంభమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోలో వెలిసిన యాక్సెలరేషన్‌ కన్సార్టియం అనే అటనమస్‌ ల్యాబ్‌ దీనికి ఒక నిదర్శనం. కాలిఫోర్నియాలోని లారెన్స్‌ బెర్కెలీ నేషనల్‌ ల్యాబోరేటరీ కూడా త్వరలోనే ఎ-ల్యాబ్‌ పేరుతో స్వయం ప్రయోగశాలను ఏర్పాటు చేయనుంది. ఇది తనకు తానే కొత్త స్పటికాల ఆకృతులను సమన్వయం చేయగలదు, పరీక్షించగలదు. దీనికి గూగుల్‌ డీప్‌మైండ్‌ సంస్థ ఇప్పటికే తమ ఏఐ స్ఫటికాల అంచనాలను అందజేసింది. ఇటీవల బోస్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు బేయేసియన్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ అటనమస్‌ రీసెర్చర్‌ (బేర్‌) సాయంతో అత్యధిక శక్తిని శోషించుకునే ఆకారాన్నీ కనుగొన్నారు. 3డీ ప్రింటర్‌, రోబో చేయి, త్రాసులు, హైడ్రాలిక్‌ ప్రెస్‌, ఏఐ సమన్వయంతో కూడిన బేర్‌ మనుషుల ప్రమేయం లేకుండా తనకు తానే 50 రకాల ప్రయోగాలు చేయగలదు. చైనాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ అంగారకుడి ఉల్కల ఖనిజాల నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి ఉత్ప్రేరకాలను రూపొందించే పనిని ఓ రోబో ‘రసాయన శాస్త్రవేత్త’కు అప్పగించింది. ఇది ఏఐ వ్యవస్థ సాయంతో తనకు తానే మూలకాల మిశ్రమాలను విశ్లేషించి, ఉత్తమమైన ఉత్ప్రేరకాన్ని రూపొందించింది. అంగారకుడి మూలకాల్లో 37 లక్షల రకాలున్నాయి. వీటిని మానవులు విశ్లేషించాలంటే సుమారు 2వేల ఏళ్లు పడుతుంది. అదీ ఒక్కో పరీక్షను 5 గంటల్లో పూర్తిచేస్తే. కానీ రోబో శాస్త్రవేత్త అనతికాలంలోనే దీన్ని సాధించేసింది. ఇది ఒక్కో సంయోగాన్ని తనిఖీ చేయటం కన్నా ఏఐ సాయంతో ఆక్సిజన్‌ ఉత్పత్తికి తోడ్పడే ఉత్తమ ఉత్ప్రేరకాన్ని అంచనా వేయటం విశేషం. ఈ ప్రక్రియ మున్ముందు అంగారకుడి మీదికి వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్‌ అందించటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు.

కొన్ని సందేహాలు

అటనమస్‌ ప్రయోగశాలల విషయంలో కొన్ని సందేహాలు లేకపోలేదు. ఇవి నిర్వహించిన ప్రయోగాల ఫలితాలను మనుషులే వ్యాఖ్యానించాల్సి ఉంటుంది. ఇది శాస్త్రవేత్తల మధ్య వివాదానికి దారితీయొచ్చు. ఎ-ల్యాబ్‌ ప్రాజెక్టు విషయంలో ఇలాగే జరిగింది. పరికరాలూ మనుషులు చెప్పినట్టుగానే నడచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ శోధించాలి? ఏ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాలి? అనేవి మనమే నిర్దేశించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీటికి మానవ పరిశోధకుల మాదిరిగా సాధారణ పరిశోధన శక్తులేవీ లేవు. కానీ కృత్రిమ మేధ అంచనాలు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అటనమస్‌ ల్యాబ్‌లు మున్ముందు బాగా పుంజుకోగలవని భావి  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు